
మూవీ రివ్యూ: ప్రేమంటే
నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, వెన్నెల కిషోర్, అభయ్, కిరీటి తదితరులు
ఎడిటర్స్: అన్వర్ అలీ, రాఘవేంద్ర తిరున్
సినిమాటోగ్రాఫర్: విశ్వంత్ రెడ్డి
సంగీతం: లియోన్ జేమ్స్
నిర్మాత: జాన్వి నారంగ్
దర్శకుడు: నవనీత్ శ్రీరామ్
కథ:
మధుసూధన రావు (ప్రియదర్శి) ఒక సెక్యూరిటీ సిస్టం ఆఫీసు ఏర్పాటు చేసుకొని బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మానాన్నలు అతనికి పెళ్లి చేయాలని చూస్తారు. కానీ అది ఇష్టం లేక వచ్చిన ప్రతి సంబంధం చెడగొడుతూ ఉంటాడు. ఆ సమయంలో రమ్య(ఆనంది)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. హాయిగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో తన భర్త గురించి ఒక సంచలన నిజం తెలుస్తుంది. అది తెలిసాక చేసేదేం లేక భర్తకు సపోర్ట్ చేస్తుంది. తెలిసిన ఆ నిజం ఏంటి.. అది తెలిసాక రమ్య రియాక్షన్ ఏంటి అనేది మిగిలిన కథ..
కథనం:
మామూలుగా అయితే పెళ్లి, పెళ్లాం, పిల్లలు అంటూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఇవన్నీ చూపిస్తుంటారు. ప్రేమంటే ప్రమోషన్స్ చూసాక ఇలాగే అనిపిస్తుంది కథ. కానీ థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు ఒక అరగంట తర్వాత అసలు ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. అసలు కథ అది కాదని.. ఇంకా చెప్పాలంటే ఇన్ని రోజులు టీజర్, ట్రైలర్‌లో చూసిన కథే ఇది కాదని అర్థం అవుతుంది. ఎవరూ ఊహించని ఓ టర్న్ తీసుకుని అక్కడ్నుంచి కథ ఎటెటో వెళ్లిపోతుంది. మొదటి అరగంట నార్మల్‌లా సాగిపోతుంది. పెద్దగా ట్విస్టులు ఏమీ ఉండవు.. కానీ మెయిన్ ట్విస్ట్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో అక్కడ్నుంచి కథనం మారిపోతుంది. కానీ దాన్ని డీల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు దర్శకుడు నవనీత్. ఫన్, రొమాన్స్ బాగానే అనిపించినా.. ఇంటర్వెల్ నుంచే అసలు సమస్య మొదలవుతుంది. సెకాండాఫ్ అదింకా పెరిగిపోతుందే తప్ప తగ్గదు. అది తెలియాలంటే కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేయాలి. అలా చూస్తే చూసేవాళ్లకు ఇంట్రెస్ట్ పోతుంది. ఈ సినిమా ఒక టిపికల్ లైన్‌తో వెళ్లింది. ఇందులో సుమ కనకాల పాత్ర కూడా పర్లేదు. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌తో వచ్చే సీన్స్ కామెడీ బాగానే అనిపిస్తుంది. ఇక కొన్ని సీన్స్ ఏమో మరీ లాజిక్ లేకుండా ఎక్కువ లిబర్టీ తీసుకొని సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా అంతే. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లాంటి వాళ్లు ఉన్నా కూడా పెద్దగా వాడుకోలేదు. కథ ఎక్కడ మొదలై.. ఎక్కడెక్కడో తిరిగి ఎటెటో వెళ్లిపోతుంది ప్రేమంటే. చివరికి ఎందుకిదంతా అంటే ప్రేమంటే అని చెప్తారు.
నటీనటులు:
ప్రియదర్శి బాగా నటించాడు కానీ ఇది ఆయనకు సూట్ అయ్యే పాత్ర కాదు. కథ తన చుట్టూ కాకుండా.. కథ చుట్టూ తాను తిరిగే పాత్రలైతేనే దర్శికి బాగా సూట్ అవుతాయి. ఆనంది క్యూట్‌గా ఉంది.. చాలా బాగా నటించింది. వెన్నెల కిషోర్ బాగా నవ్వించాడు.. సుమ కనకాల పాత్ర బాగుంది.. కనెక్ట్ అయ్యి ఈ పాత్ర చేసిందేమో కానీ ఆమె స్థాయి క్యారెక్టర్ అయితే కాదిది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
లియోన్ జేమ్స్ సంగీతం బాగుంది. విశ్వంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ నీట్‌గా బాగుంది. రాఘవేంద్ర తిరున్ ఎడిటింగ్ అంతంతమాత్రమే. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ విషయానికి వస్తే.. ఆలోచన బాగున్నా ఆచరణ మాత్రం అస్సలు ఆకట్టుకోలేదు. అనుకున్న కథను ఎస్టాబ్లిష్ చేయడంలో బాగా తడబడ్డారు. మెయిన్ సెకండాఫ్ మీద ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ప్రేమంటే.. కచ్చితంగా ఇదైతే కాదు..!