
మూవీ రివ్యూ: ఇరుముడి
నటీనటులు: రవితేజ, ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, రవిశంకర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ
చాలా సంవత్సరాల తర్వాత రవితేజ నుంచి వచ్చిన మోస్ట్ హైప్డ్ సినిమా ఇరుముడి. శివా నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూసి తెలుసుకుందాం..
కథ:
సీలేరు ప్రాంతంలోని ఒక చిన్న పల్లెటూర్లో అరటిపళ్ళ వ్యాపారం చేసుకునే త్రినాథ్ (రవితేజ).. అతనిది ఒక చిన్న కుటుంబం. భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర) అంటే ప్రాణం. ఊర్లో ఏం జరిగినా నాన్నకు చెప్పడం మణికంఠకు అలవాటు. తన అరటిపళ్ళ వ్యాపారం చేసుకుంటూనే ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటాడు త్రినాథ్. అంతా సాఫీగా సాగిపోతున్న త్రినాథ్ జీవితంలోకి అనుకోకుండా ఒక కుదుపు వస్తుంది. ఆ ఊర్లో చదువుకునే అమ్మాయిలు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని విషయాలు మణికంఠకు తెలుస్తాయి. అలా గొడవ త్రినాధ్ ఇంటి మీదకి కూడా వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ ఊర్లో అమ్మాయిలను త్రినాధ్ ఎలా కాపాడాడు.. ఈ క్రమంలో మణికంఠకు ఏం జరిగింది అనేది అసలు కథ..
కథనం:
నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. వాటిని డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు..
ఇరుముడి సినిమాలో అలాంటి కఠినమైన నిజాలని చెప్పాడు శివ నిర్వాణ. ఈ సినిమా కమర్షియల్ గా ఆడుతుందా లేదా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తీసాడు. ఆడపిల్ల తండ్రులకు ఈ సినిమా చూస్తున్నప్పుడు భయమేస్తుంది.. అలాంటి కొన్ని మనసును హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్నా కూడా ఇది పక్కా కమర్షియల్ సినిమా. తెలిసిన కథనే కానీ సరికొత్త స్క్రీన్ ప్లేతో చెప్పాడు శివ నిర్వాణ.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆలోచింపచేస్తాయి. ఫస్టాఫ్ అంత సరదా సరదాగా వెళ్ళిపోతుంది. అయ్యప్ప మాలధారణ, భక్తి పాటలు, మధ్య మధ్యలో తండ్రీ కూతుర్ల సెంటిమెంట్.. సెకండాఫ్ మొదలైన తర్వాత గాని అసలు కథ మొదలవదు. మరి ఊహించలేనంత కొత్త కథ కాదు.. ఆడపిల్లకు భయం ఉండకూడదు అనే లైన్ ఈ సినిమాతో చెప్పాలనుకున్నాడు శివ.
దానికి రవితేజ లాంటి యాక్టర్ తోడయ్యేసరికి మెసేజ్ బాగానే పాస్ అయింది. ఎమోషనల్ సినిమా కాబట్టి స్లోగానే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఏడిపించాలని ఫిక్స్ అయిపోయి రాసుకున్నాడు శివ నిర్వాణ. ఆడపిల్లను ధైర్యంగా పెంచాలి వాళ్ళలో భయం ఉండకూడదు అనే ఒక మంచి సందేశాన్ని ఈ సినిమాలో చెప్పాడు. ఇరుముడిలో లోపాలు బాగానే ఉన్నాయి.. కానీ వాటిని కంటెంట్ తో కవర్ చేశాడు శివ నిర్వాణ.
నటీనటులు:
చాలా రోజుల తర్వాత రవితేజ కంటెంట్ ఉన్న సినిమా చేశాడు. అయ్యప్ప భక్తుడిగా చాలా బాగున్నాడు రవితేజ. బేబీ నక్షత్ర అద్భుతంగా నటించింది.. ప్రియ భవాని శంకర్ కూడా చాలా సెటిల్ గా కనిపించింది. సాయికుమార్, అజయ్ ఘోష్ లాంటి నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
జీవి ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా అయ్యప్ప స్వామి పాటలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా ఇరుముడి సినిమాకు ప్రాణం. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో లేనంత ప్రెస్ లొకేషన్స్ ఇందులో ఉన్నాయి. చాలా న్యాచురల్ గా ఉన్నాయి ఈ లొకేషన్స్ అన్నీ. ఎడిటింగ్ కాస్త వీక్.. సెకండాఫ్ చాలా సన్నివేశాలు స్లో అయ్యాయి. దర్శకుడు శివ నిర్వాణ బలమైన కథను చెప్పాడు.. ఈ క్రమంలో అక్కడక్కడ ఆయన స్లో అయ్యాడు కానీ ఓవరాల్ గా మంచి మెసేజ్ ఇచ్చాడు.
పంచ్ లైన్:
ఓవరాల్ గా ఇరుముడి.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా..!