I Hate Marriage Movie Review : ఐ హేట్ మ్యారేజ్ మూవీ రివ్యూ.. ప్రేమ, పెళ్లి, కన్ఫ్యూజన్..!

ప్రస్తుత తరం యువత ఆలోచనా విధానం, వివాహ వ్యవస్థపై మారుతున్న దృక్పథం, పెళ్లికి ముందే ఏర్పడే అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన కొత్త చిత్రం 'ఐ హేట్ మ్యారేజ్'. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో వివరంగా చూద్దాం.

I Hate Marriage Movie Review : ఐ హేట్ మ్యారేజ్ మూవీ రివ్యూ.. ప్రేమ, పెళ్లి, కన్ఫ్యూజన్..!
I Hate Marriage Movie Revie

Edited By:

Updated on: Nov 27, 2026 | 11:25 AM

మూవీ రివ్యూ: ఐ హేట్ మ్యారేజ్

నటీనటులు: సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్, సాహితి కృష్ణ, డాక్టర్ పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి తదితరులు

సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి

సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్

ఎడిటింగ్: ఆవుల వెంకటేష్

నిర్మాతలు: దయానంద్ మాడమ్, కార్తీక్ వెంపటి

దర్శకుడు: పరమేశ్ రేణుకుంట్ల

ప్రస్తుత తరం యువత ఆలోచనా విధానం, వివాహ వ్యవస్థపై మారుతున్న దృక్పథం, పెళ్లికి ముందే ఏర్పడే అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్’. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో వివరంగా చూద్దాం.

కథ:

సినిమా దర్శకుడు కావాలనే బలమైన లక్ష్యంతో ఉండే రామ్ (సుగి విజయ్)కు ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై అస్సలు ఆసక్తి ఉండదు. తల్లి ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా సున్నితంగా తిరస్కరిస్తుంటాడు. మరోవైపు సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తూనే, నిజమైన ప్రేమ కోసం వెతికే జాహ్నవి (జుప్సీ భద్ర)కు రామ్ స్వభావం బాగా నచ్చుతుంది. కొన్ని ప్రత్యేక షరతులు పెట్టి అతనితో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమవుతుంది. అలా మొదలైన వీరిద్దరి ప్రయాణాన్నే రామ్ సినిమా కథగా మలిచి, చిన్నచిన్న మార్పులతో ఒక నిర్మాతకు వినిపించి ఓకే చేయించుకుంటాడు. అయితే సినిమా ద్వితీయార్థాన్ని ఎలా ముగించాలనే అంశం ఉత్కంఠగా మారుతుంది. ఈ క్రమంలోనే రామ్ మనసు జాహ్నవి వైపు మళ్లుతుంది. మరి అతని ప్రేమను జాహ్నవి అంగీకరించిందా? అసలు రామ్ ముందు ఆమె ఉంచిన షరతులు ఏంటి? నేటి తరం అమ్మాయిలు వివాహ బంధానికి ఎందుకు దూరంగా జరుగుతున్నారు? చేసిన పొరపాట్లను యువతులు ఎలా దాచి పెడుతున్నారు? చివరకు వీరిద్దరి బంధం ఎలాంటి మలుపు తిరిగింది? అనే అంశాల సమాహారమే మిగిలిన సినిమా.

కథనం:

రెగ్యులర్ లవ్ స్టోరీల ఫార్మాట్‌ను పక్కనపెట్టి, సమకాలీన సమాజంలో యువత ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. వివాహ బంధంలో ఇరుక్కోకుండా సహజీవనం చేస్తూ, తమ ఇష్టాలకు అనుగుణంగా స్వేచ్ఛగా బతకాలని నేటి అమ్మాయిలు కోరుకుంటున్న తీరును ఎక్కడా మొహమాటం లేకుండా తెరపై ఆవిష్కరించారు. అదే సమయంలో ఉన్నత చదువులు, గొప్ప ఆశయాలతో పల్లెటూళ్ల నుంచి నగరాలకు వచ్చి హాస్టళ్లలో ఉండే యువతులు ఎలా తప్పుదారి పడుతున్నారు, తమ గమ్యాన్ని ఎలా మర్చిపోతున్నారు అనే చేదు నిజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే అందరూ ఒకేలా ఉండరని, బాధ్యతగా ఉంటూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడే యువత కూడా ఉందనే కోణాన్ని బ్యాలెన్స్ చేస్తూ చెప్పడం మెచ్చుకోదగ్గ విషయం. మనసుపడ్డ వాడితో జీవితం పంచుకోవాలా లేక పెద్దలు కుదిర్చిన సంబంధానికి తలొగ్గాలా అనే మానసిక సంఘర్షణను ఇందులో ప్రస్తావించారు. వ్యక్తిగత స్వేచ్ఛ, పరస్పర విశ్వాసం, నిజాయతీ లాంటి సున్నితమైన అంశాలను చర్చిస్తూనే, వివాహంపై ఓపెన్ డిబేట్ పెట్టారు. కూతురి సంతోషం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే తల్లిదండ్రులు, ఆమె ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి చేయడానికి మాత్రం ఎందుకు సంకోచిస్తారనే బలమైన ప్రశ్నను సంధిస్తూ మంచి సందేశాన్ని అందించారు.
కథాంశం పరంగా ఇంత ధైర్యంగా, వాస్తవికతకు దగ్గరగా ఆలోచించినప్పటికీ, దానిని ప్రేక్షకులను కట్టిపడేసేలా తెరపైకి తీసుకురావడంలో మాత్రం దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయాడు. తెరకెక్కించిన విధానంలో నాణ్యత లోపించడంతో పాటు, సన్నివేశాల నడక చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్నిచోట్ల సంభాషణలు పాతబడినట్లుగా, ఊహించే విధంగా ఉండటం వల్ల కథనంపై ఆసక్తి తగ్గుతుంది. ప్రధాన అంశాలను ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేగా మలచడంలో పట్టు తప్పినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. భావోద్వేగాలు, సహజత్వం మరింత బలంగా పండి ఉండి, నటీనటుల నుంచి ఇంకాస్త మెరుగైన నటనను రాబట్టి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. అయితే చివరి ఘట్టం మాత్రం ప్రేక్షకులకు కాస్త ఊరటనిస్తూ పర్వాలేదనిపిస్తుంది.

నటీనటులు:

రామ్ పాత్రలో సుగి విజయ్ తన పరిధి మేరకు చక్కగా ఒదిగిపోయాడు. పెళ్లిపై విరక్తి చూపించే కుర్రాడిగా, దర్శకుడు కావాలనే తపన ఉన్న యువకుడిగా తన హావభావాలను బాగా పలికించాడు. వివాహాన్ని వ్యతిరేకించే వ్యక్తి క్రమంగా ప్రేమలో పడే సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తానికి కేంద్రబిందువుగా నిలిచిన జాహ్నవి పాత్రలో జుప్సీ భద్ర మెరిసింది. ఆధునిక పోకడలను ఇష్టపడే నేటి తరం అమ్మాయిగా ఆమె చూపించిన అభినయం కథకు బలాన్నిచ్చింది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించిన హారిక రాజేందర్, సాహితి కృష్ణ, డాక్టర్ పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి తమకు దక్కిన నిడివిలో సహజంగా నటించి న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవాల్సింది ఎడిటర్ ఆవుల వెంకటేష్ గురించి. తన అనుభవాన్ని రంగరించి, సన్నివేశాలను పదునుగా కత్తిరిస్తూ ఒక సీన్ నుంచి మరో సీన్‌కు చక్కని లింక్ కుదిర్చారు. సినిమాకు ఎడిటింగ్ పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ప్రవీణ్ ఇమ్మడి నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించినా, అక్కడక్కడా టీవీ సీరియల్స్ ను గుర్తుచేసేలా సాగింది. విజయ్ సి కుమార్ కెమెరా పనితనం ఆశించిన స్థాయిలో లేదు, విజువల్స్‌లో రిచ్‌నెస్ లోపించింది. ఇక దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల ఎంచుకున్న పాయింట్ కొత్తగా, ధైర్యంగా ఉన్నప్పటికీ, మేకింగ్ మరియు టేకింగ్ మీద ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే మంచి ఫలితం దక్కేది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా ఐ హేట్ మ్యారేజ్.. డిఫరెంట్ మెసేజ్..!

Loading...
Unable to load recommendations.
Follow Us