
నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్ మంజు, శివాజీ, ప్రవీణ్, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, శత్రు తదితరులు
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫర్: లియోన్ ప్రిట్టో
ఎడిటర్: నవీన్ నూలి
దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు
నిర్మాతలు: నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
ఈ వారం థియేటర్స్‌లోకి చాలా సినిమాలు వచ్చాయి. అందులో అందరి ఫోకస్ ఉన్నది మాత్రం అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మీదే.. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో.. భారతం లాంటి కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగిందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
2001లో ఈ చిత్ర ఇతివృత్తం సాగుతుంది. కర్నూలు కారాగారం నుండి అనుకున్న దానికంటే ముందస్తుగా విడుదలైన లెనిన్ (అఖిల్ అక్కినేని) తన సొంతూరు శ్రీరామాపురంలోని భరతమిట్ట చేరుకుంటాడు. వచ్చీ రాగానే తన పగ తీర్చుకునే పని మొదలుపెడతాడు. అసలు లెనిన్‌కు ఆ ఊరులో వాళ్లు చేసిన అన్యాయమేంటి..? తన సొంత వాళ్లే శత్రువులుగా ఎలా మారారు..? భారతంలోని పాత్రలకు తగ్గట్లుగా ఆ ఊళ్లో మనుషులు ఎలా ఉన్నారు..? తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భారతి (భాగ్యశ్రీ బోర్సే) జీవితంలో జరిగిన ఘోరం ఏమిటి వీటి చుట్టూ నడుస్తుంటుంది కథ. లెనిన్ జైలుపాలు కావడానికి కారణం ఎవరు? అతడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్లెవరు? ఈ మొత్తం వ్యవహారంలో అతడి ఆప్తమిత్రుడు వసంత్ (ప్రమోద్ పంజు) పోషించిన పాత్ర ఏమిటి? తనకు జరిగిన అన్యాయానికి లెనిన్ ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అన్నది వెండితెర మీద చూడాల్సిందే.
కథనం:
ఈ చిత్ర దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మహాభారతం స్ఫూర్తితో సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు కథా గమనం ఒక ఎత్తు అయితే.. సెకండాఫ్‌లో సినిమాను నడిపించిన తీరు మరో ఎత్తు. దర్శకుడు ప్రతి పాత్రను చాలా లోతుగా మలిచాడు. కథలో వచ్చే ప్రతి క్యారెక్టర్ కు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం పాత పల్లెటూరి పగలు, ప్రతీకారాల సినిమాలను చూస్తున్న భావన కలుగుతుంది. మహాభారతం నేపథ్యాన్ని కథకు ముడిపెట్టడం అనేది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అలాగే హీరో అసలు జైలుకు ఎందుకు వెళ్ళాడనే విషయంపై దర్శకుడు మరింత స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో హీరోపై వచ్చే ఒక కీలకమైన మలుపు కాస్త అతకనట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్‌లో లాజిక్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేయడంలో దర్శకుడి ప్రతిభ అద్భుతంగా పనిచేసింది. ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలచడంలో ఆయన సఫలమయ్యాడు. అనవసరమైన అంశాలను పక్కన పెడితే, సినిమాలోని భావోద్వేగాలు నేరుగా హృదయానికి హత్తుకుంటాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ పరిధి మేరకు ఉన్నాయి. ఎక్కడా కథను పక్కదారి పట్టించుకండా అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించారు మురళీ కిషోర్. పైగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో అఖిల్ నటన కూడా సినిమా రేంజ్‌ను పెంచేసింది. కొన్ని పాత సినిమాల రిఫరెన్సులు కనిపించినా కూడా లెనిన్ ప్రత్యేకత లెనిన్‌కు ఉంది.
నటీనటులు:
ఇప్పటి వరకు మనం స్క్రీన్ మీద చూసిన అఖిల్ వేరు.. లెనిన్‌లో చూసిన అఖిల్ వేరు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అక్కినేని వారసుడు. ఇప్పటిదాకా ఎవరూ ఊహించని రీతిలో లెనిన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ముఖ్యంగా సినిమా చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో తనలోని అసలైన నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు. భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథకు అవసరమైనంత బరువును తన భుజాలపై మోసింది. హీరోకు స్నేహితుడిగా, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో ప్రమోద్ పంజు అంచనాలకు మించి నటించాడు. తన పాత్రలోని వైవిధ్యమైన కోణాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక శివాజీకి ఒక బలమైన పాత్ర దక్కింది. బ్రహ్మాజీ, శత్రు, ఈశ్వరీ రావు తదితరులు తమ తమ పరిధుల మేర చక్కని నటనను కనబరిచారు.
టెక్నికల్ టీం:
థమన్ ఈ సినిమాకు హీరో.. పాటల సంగతి ఎలా ఉన్నా నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్‌లో వచ్చే ఆర్ఆర్ అదిరిపోయింది. ఆర్ట్ వర్క్ కూడా లెనిన్ సినిమాకు బలం. భారీ సెట్టింగ్స్ వేసి చిత్రీకరించినప్పటికీ, ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. చాలా సహజమైన వాతావరణాన్ని కెమెరామెన్ తన లెన్స్‌లో చూపించారు. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది కానీ అక్కడక్కడా వచ్చే అనవసరమైన పాటలకు కత్తెర వేసి ఉంటే సినిమా వేగం ఇంకాస్త పెరిగేది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తను అనుకున్న కథను, తన మనసులోని ఆలోచనలను తెరపై ఎంతో అద్భుతంగా ఆవిష్కరించాడు. నాగార్జున, నాగవంశీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ‘లెనిన్’.. విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. నేటి భారతం..!