
“సక్సెస్ అనేది స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే అరగంటలో వచ్చే ఫుడ్ కాదు.. అదొక సుదీర్ఘ పోరాటం” అని ఓ సినీ పెద్ద అన్నట్లుగానే, నేడు బాలీవుడ్‌ను తన సినిమాలతో షేక్ చేస్తున్న డైరెక్టర్ ఆదిత్య ధర్ ప్రస్థానం కొనసాగింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ‘దురంధర్’ సినిమాతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆదిత్య ధర్.. ఈ స్థాయికి చేరుకోవడానికి పదేళ్లకు పైగా ఎన్నో అవమానాలను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒకప్పుడు గీత రచయితగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన, నేడు వందల కోట్ల వసూళ్లను సాధించే దర్శకుడిగా ఎదగడం వెనుక ఒక గొప్ప పోరాటమే ఉంది.
ఆదిత్య ధర్ తన ప్రయాణాన్ని ఒక లిరిసిస్ట్ గా ప్రారంభించారు. పలు సినిమాలకు అద్భుతమైన పాటలు రాస్తూ గుర్తింపు తెచ్చుకున్నా, ఆయన మనసు మాత్రం ఎప్పుడూ దర్శకత్వం వైపే ఉండేది. ఈ క్రమంలోనే లిరిసిస్ట్ నుంచి డైలాగ్ రైటర్‌గా, ఆపై స్క్రీన్ రైటర్‌గా మారారు. ‘ఆర్టికల్ 370’ వంటి సినిమాలకు పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. అయితే, దర్శకుడిగా మారడం మాత్రం అతనికి పూలబాట కాలేదు. దర్శకుడిగా ఆదిత్య మొదటి ప్రయత్నం ‘రాకీ బాత్’ అనే సినిమాతో మొదలైంది.
కానీ, ఆ సినిమాలో పాకిస్తానీ నటులు ఉన్నారనే కారణంతో అప్పట్లో జరిగిన ‘యురి అటాక్’ కారణంగా ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి, చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైన వేళ.. కుంగిపోకుండా అదే ‘యురి’ స్ట్రైక్స్‌పై సినిమా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అలా అతి తక్కువ బడ్జెట్(రూ. 30 కోట్లు)తో తీసిన ‘యురి: ద సర్జికల్ స్ట్రైక్’ ఏకంగా రూ.350 కోట్లు సాధించి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌ను చేసింది.
Dhurandhar
యురి వంటి భారీ హిట్ తర్వాత కూడా ఆదిత్యకు కష్టాలు తప్పలేదు. తాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘అశ్వత్థామ’ చిత్రం బడ్జెట్ కారణాల వల్ల చివరి నిమిషంలో నిలిచిపోయింది. వరుసగా రెండేళ్లు ఆ ప్రాజెక్ట్ కోసం శ్రమించినా ఫలితం దక్కలేదు. ఆ సమయంలోనే యామీ గౌతమ్‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఆదిత్య, నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
తాజాగా ‘దురంధర్’ విషయంలో కూడా అలాంటి బడ్జెట్ సమస్యలు వస్తాయని ముందే గ్రహించి, రిస్క్ చేసి మరీ రెండు భాగాలను ఒకేసారి షూట్ చేసి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశారు. నేడు ‘దురంధర్’ 10 రోజుల్లోనే రూ. 500 కోట్లు వసూలు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. లిరిసిస్ట్ గా మొదలై, సినిమాలు ఆగిపోయినా బెదరక, అవమానాలనే విజయానికి సోపానాలుగా మార్చుకున్న ఆదిత్య ధర్ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. వచ్చే ఏడాది రాబోయే ‘దురంధర్ 2’తో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.