అనుకోకుండా వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపింది. అందులో సినిమా రంగం కూడా ఉంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఇక సడలింపుల్లో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగ్‌లకు అనుమతిని ఇచ్చినా.. సెట్స్ మీదకు వెళ్లేందుకు సినిమా వాళ్లు సాహసం చేయలేకపోతున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే లాక్‌డౌన్‌కు ముందు చాలా సినిమాలు చిత్రీకరణను పూర్తి చేసుకోగా.. అవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేకపోవడంతో అందరి దృష్టి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలపై పడింది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల కూడా అయ్యాయి. కాగా బాలీవుడ్‌లోని కొన్ని చిత్రాలు, సిరీస్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఆ లిస్ట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘దిల్ బేచారా’, విద్యాబాలన్ ‘శంకుతలా దేవీ’, జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ సినిమాలు ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్‌లలో అభిషేక్ బచ్చన్, నిత్యామీనన్ నటించిన ‘బ్రీత్: ఇన్‌టు ద షాడోస్’, సైఫ్ అలీ ఖాన్ ‘ధిల్లీ’, మనోజ్ బాజ్‌పేయ్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, రైమా సేమ్ ‘లాస్ట్ అవర్’, కొంకణా సేన్ ‘ముంబయి డైరీస్ 26/11’లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి రిలీజ్ డేట్‌లు ఫిక్స్ అవ్వగా.. మరికొన్నింటికి విడుదల తేదీలు ఖరారు అవ్వాల్సి ఉంది.