
‘కాళ్లు తడవకుండా సముద్రం దాటచ్చు, కానీ కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేము’. ఈ ఒక్క సామెత చాలు జీవిత సారం ఏంటో చెప్పడానికి. ఎంతటి వారికైనా జీవితం అంత సులభంగా ఉండదు. బయట నుంచి అందరి జీవితాలు బాగానే కనిపించినా, ఎవరి కష్టాలు వారికి ఉంటాయని చెబుతుంటారు. సాధారణంగా సినీ తారల జీవితాలు సంతోషంగా ఉంటాయి, అసలు వారికి కష్టమనేది ఉండదని భావనలో ఉంటాం.
బయట ప్రపంచానికి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల జీవితాల్లోనూ చీకటి రోజులు ఉంటాయని చాలా కొద్ది మందికే తెలుసు. సెలబ్రిటీలు ప్రస్తుతం ఉన్న స్థానానికి చేరుకోవడానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటుంటారు. ఒక్కసారిగా గతాన్ని తలుచుకుంటే ఇలాంటి చేదు జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరి జీవితంలో సహజమే. తాజాగా ఇలాంటి ఓ అనుభవాన్ని పంచుకుంది అందాల తార అలియా భట్. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబమైనా, తండ్రి పెద్ద దర్శకుడు అయినా తమ జీవితంలోనూ కొన్ని బ్యాడ్ డేస్ ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. తాజాగా ఆదివారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
అలియా తండ్రి మహేష్ భట్ ఎంత పెద్ద దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో ఎన్నో భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అయితే తన తండ్రి సైతం కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని చెప్పుకొచ్చింది. ఈ విషయమై అలియా మాట్లాడుతూ.. ‘‘మీ నాన్న పెద్ద దర్శకుడు. మీది విలాసాల జీవితం. మీలాంటి వాళ్లు సినిమాల్లోకి రావడం తేలిక.. ఇలాంటి మాటలు నాతో చాలామంది అనేవాళ్లు. కానీ ఎంత పెద్ద దర్శకుడైనా.. మా నాన్న జీవితంలో చీకటి రోజులున్నాయి’ అని చెప్పుకొచ్చింది అలియా.
ఎన్నో గొప్ప సినిమాలు తీసిన తర్వాత నాన్నకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయని తెలిపిన అలియా.. చివరికి చేతిలో చిల్లిగవ్వ లేని రోజులు వచ్చాయని గుర్తుచేసుకుంది. ఒకానొక సమయంలో తన తండ్రి తాగుడికి అలవాటు పడ్డారని తెలిపిన అలియా.. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో అలియా తల్లి సైతం సినిమాల్లో నటించాలని ఎంతో ప్రయత్నించింది, అవకాశాలివ్వమని ఎంతో ప్రాథేయపడింది. ఎన్ని కష్టాలు ఎదురైనా క్రమ శిక్షణ, ఓపిక ఉంటేనే ఎదుగుతామని తన తల్లి ఎప్పుడూ చెప్తుండేదని అలియా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక అలియా కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం జిగ్రా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..