ప్రతి రోజూ బెండకాయ కూర ఉండాల్సిందే.. ఆ జ్యూస్ తాగడం వల్లే నాగార్జున జుట్టు ఊడదు.. డైట్ సీక్రెట్ చెప్పిన మేకప్ మెన్..

అక్కినేని నాగార్జున వయసును లెక్కచేయకుండా ఫిట్‌గా, యంగ్‌గా ఉండటం వెనుక ఉన్న రహస్యాలను ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ చంద్ర బయటపెట్టారు. రోజువారీ డైట్, ప్రత్యేక ఆరోగ్య పానీయం, వ్యాయామం, చేపల పట్ల ఆయనకున్న ఇష్టం వంటి వ్యక్తిగత వివరాలను తెలియజేస్తూ, నాగార్జున క్రమశిక్షణతో కూడిన జీవనశైలి గురించి చెప్పుకొచ్చారు.

ప్రతి రోజూ బెండకాయ కూర ఉండాల్సిందే.. ఆ జ్యూస్ తాగడం వల్లే నాగార్జున జుట్టు ఊడదు.. డైట్ సీక్రెట్ చెప్పిన మేకప్ మెన్..
Nagarjuna

Updated on: Nov 07, 2026 | 4:07 PM

అక్కినేని నాగార్జున ఎప్పుడూ యంగ్‌గా, ఫిట్‌గా కనిపించడానికి గల కారణాలను ఆయన వ్యక్తిగత మేకప్ మ్యాన్ చంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. నాగార్జున కేవలం తన రిచ్‌నెస్‌తో కాకుండా, తన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శరీర నిర్వహణతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని చంద్ర తెలిపారు. నాగార్జున వారంలో ఐదు రోజులు సాధారణ ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. ఉదాహరణకు, అల్పాహారంగా ఒక ఇడ్లీ లేదా ఒక వడ, ఒక గారె మాత్రమే తింటారు. ఆయనకు ఆకలి వేస్తేనే తింటారని, ఆకలి లేనిది ఎప్పుడూ ఆహారం తీసుకోరని చంద్ర స్పష్టం చేశారు. చాలామందిలాగా ఆకలి ఉన్నా లేకపోయినా ఎవరో పెడితే తినే అలవాటు ఆయనకు లేదని పేర్కొన్నారు. ప్రతిరోజూ బెండకాయ కూర ఉండాలి. హాట్ చిప్స్, రసం, ఒక అరటిపండు కూడా తప్పనిసరి. అన్నం విషయానికి వస్తే, ఆయన మన సాధారణ బియ్యంతో వండిన అన్నం తినరని అన్నారు. పాత రోజుల్లో ఉండే తవుడు తీయని దంపుడు బియ్యం అన్నాన్ని మాత్రమే తింటారు. ఈ అన్నం చాలా మెత్తగా, ముద్దలాగా ఉండాలని ఆయనకు ఇష్టమని చంద్ర వివరించారు. ఈ నాలుగు రకాలు కంపల్సరీగా ఉంటాయి, కానీ అన్నీ తక్కువ పరిమాణంలోనే తీసుకుంటారు.

శనివారం రాత్రి నాగార్జున ఇష్టపడే ఆహారం పాంప్లెట్ చేప. ఈ చేపలంటే ఆయనకు చాలా ఇష్టం. ఔట్‌డోర్ షూటింగ్‌లప్పుడు కూడా చంద్ర స్వయంగా ఆయనకు చేపలు వండి పెట్టేవారట. ఈ చేపలను ప్రత్యేకంగా వెల్లుల్లిపాయలను సన్నగా కోసి, అల్లం, పెప్పర్ (కారం బదులు) ఆలివ్ ఆయిల్‌లో నానబెట్టి, ఫిష్‌పై వేసి కాలుస్తారు. పసుపు, అల్లం ముద్ద లాంటివి వాడకుండా ఈ విధంగా తయారుచేయడం ఆయనకు చాలా ఇష్టం. ఆదివారం రోజు కొద్దిగా ఎక్కువ తింటారేమో కానీ, మటన్ లేదా చికెన్ కూడా రెండు మూడు ముక్కలే తీసుకుంటారని చంద్ర వెల్లడించారు. నాగార్జున ప్రతిరోజూ ఉదయం షూటింగ్‌కు రాగానే ఒక రాగి గ్లాసుతో ప్రత్యేక పానీయం తాగుతారు. నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్‌రూట్, పటికబెల్లం లేదా తేనె కలిపిన జ్యూస్‌ను పరగడుపున తాగుతారు. ఈ పానీయం ఆయన ఆరోగ్యానికి, ముఖ్యంగా ఆయన కేశ సంరక్షణకు ప్రధాన రహస్యం అని చంద్ర తెలిపారు. ఈ జ్యూస్ కారణంగానే ఆయనకు జుట్టు రాలదని, అన్నమయ్య సినిమాకు తప్పించి మరెప్పుడూ విగ్గు వాడలేదని చంద్ర గుర్తు చేసుకున్నారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాకు మొదట విగ్గు పెట్టినా, తర్వాత తీసేశారని పేర్కొన్నారు.

నాగార్జున ప్రతిరోజూ రెండుసార్లు జిమ్ చేస్తారు. ఈ క్రమశిక్షణ, ఆహారం, వ్యాయామం కలగలిసి ఆయనను నిత్యం ఫిట్‌గా ఉంచుతాయి. చంద్ర, నాగార్జునల మధ్య హీరో-మేకప్ మ్యాన్ సంబంధం కంటే మంచి స్నేహం ఉండేది. వంటపై చంద్రకు ఆసక్తి ఉండటంతో, నాగార్జున యూట్యూబ్ వీడియోలు చూపించి కొత్త వంటకాలను నేర్పేవారట. నాగార్జున క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆరోగ్య పద్ధతులే ఆయన నిత్య యవ్వనానికి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి అసలు రహస్యం అని చంద్ర తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

Loading...
Unable to load recommendations.
Follow Us