
టాలీవుడ్ నటుడు చిత్రం శ్రీను తన కెరీర్లో అనుభవించిన అత్యున్నత విజయాలు, ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితులు, ఆ తర్వాత మళ్లీ నిలదొక్కుకున్న వైనం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. ఇది కేవలం ఒక నటుడి ప్రస్థానం మాత్రమే కాదు, అతివిశ్వాసం, జీవిత పాఠాలు, దృఢ సంకల్పానికి నిదర్శనమని చెప్పొచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన “ఆనందం” సినిమాతో చిత్రం శ్రీను నటుడిగా ఒక ఉన్నత స్థాయిని చేరుకున్నారు. ఈ సినిమా విడుదలైన రెండు, మూడు రోజుల వ్యవధిలోనే తనకు 13 సినిమాలకు ఫోన్ కాల్స్ వచ్చాయని, అప్పుడు తన వయసు కేవలం 23-24 సంవత్సరాలని, ఏ అవకాశాన్ని ఎంచుకోవాలో తెలియక అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయానని గుర్తుచేసుకున్నారు. “ఆనందం” సినిమా తన జీవితంలో చెరగని ముద్ర వేసిందని ఆయన పేర్కొన్నారు. అదే సినిమాలోని ఎం.ఎస్. నారాయణ గారితో “రాంబాబు” కామెడీ సీన్ గురించి వివరిస్తూ, ఎం.ఎస్. నారాయణ టైమింగ్ అందుకోవడం చాలా కష్టమని, ఆయనతో కలిసి ఒకే టేక్‌లో డైలాగ్స్ చెప్పడానికి తాను ఎంతగానో ప్రాక్టీస్ చేశానని తెలిపారు. రెండు రోజులు అనుకున్న ఆ సీన్‌ను ఒక్క రోజులోనే పూర్తి చేశారని, శ్రీను వైట్ల వంటి దర్శకుడు కామెడీ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఎంతగా లీనమై నవ్వుతూ ఉంటారో వివరించారు.
అయితే, తన కెరీర్లో అనుకోని మలుపు ఎలా వచ్చిందో చిత్రం శ్రీను పంచుకున్నారు. “రాజు ది గ్రేట్” సినిమా సక్సెస్ మీట్లో, తన ఫోన్‌కు ఇండస్ట్రీ నుండి ఫోన్లు రావడం ఆగిపోయి, కేవలం అప్పుల వారి నుండే వస్తున్నాయని తాను స్టేజ్ మీద చెప్పి భావోద్వేగానికి గురైన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి స్థితికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించగా, తన అతివిశ్వాసం, అహంకారమే కారణమని నిజాయితీగా అంగీకరించారు. “నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను, మంచి ఆర్టిస్ట్‌ని కదా” అనే భావనతో సంపాదించిన డబ్బును పొదుపు చేసుకోలేదని, “రేపు మళ్లీ సినిమా వస్తుంది” అని ఖర్చు పెట్టేసేవాడినని తెలిపారు. రాజీవ్ కనకాల వంటి స్నేహితులు మణికొండలో భూమి కొనమని సలహా ఇచ్చినప్పుడు, “నేను మణికొండలో ఉండాలా? చిరంజీవి గారు ఎక్కడుంటారు? జూబ్లీహిల్స్‌లో ఇల్లు కొంటాను” అని అతిగా మాట్లాడేవాడినని, అప్పటి తన అహంకారం, తెలియని వయస్సు వల్లే ఇలా జరిగిందని ఆత్మవిమర్శ చేసుకున్నారు. జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని, ఉన్నప్పుడు దాచుకోవాలని, పెట్టుబడులు పెట్టాలని ఆ తర్వాతే తెలుసుకున్నానని అన్నారు. భవిష్యత్తు ఎవరి చేతిలో ఉండదని, కష్టపడి పనిచేయడం, దేవుడిని నమ్మడం మాత్రమే మనం చేయగలమని అన్నారు.
అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నానని, ఇప్పటికీ తిరుగుతానని శ్రీను అన్నారు. తన ఆర్థిక కష్టాల సమయంలో స్నేహితులు ఎంతగానో అండగా నిలిచారని తెలిపారు. వేణు, ధనరాజ్, చంద్ర వంటి మిత్రులు ఈవెంట్లకు తీసుకెళ్లారని, జబర్దస్త్‌లో చేరమని వేణు సలహా ఇవ్వడంతో అక్కడ కొన్ని రోజులు పనిచేశానని చెప్పారు. నాగిరెడ్డి (నాగ్ తేజ), చిట్టిబాబు వంటి స్నేహితులు కూడా ఈవెంట్ అవకాశాలు కల్పించి ఆర్థికంగా సహాయం చేశారని పేర్కొన్నారు. ఈవెంట్ల ద్వారా వచ్చిన డబ్బులతోనే మళ్లీ ఇండస్ట్రీలో తిరుగుతూ, దర్శకులను కలుస్తూ వచ్చానని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు మళ్లీ తిరగడానికి ఎప్పుడూ సిగ్గుపడలేదని, అది తప్పు అని అనుకోలేదని అన్నారు. డౌన్ ఫేజ్ ఉన్నా మళ్లీ పైకి లేవాలని, ఈసారి గెలిస్తే మాత్రం అతివిశ్వాసం వద్దు, క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉండాలని దృఢ సంకల్పంతో ఉన్నానని చిత్రం శ్రీను వివరించారు.
Chitram Seenu Movies
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్