West Bengal Elections: కోల్ కతా నగరం నడిబొడ్డులో టీఎంసీ-బీజేపీ వర్గాలు బాహా బాహీకి దిగాయి. బీజేపీ అభ్యర్థి రుద్రనిల్ ఘోష్ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఇరువర్గాలు విచక్షణా రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో రుద్రనిల్ తో పాటు పధ్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి రుద్రనిల్ తాను పోటీ చేస్తున్న నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం కోసం వెళ్లారు. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు వారి వాహనాలపై దాడి చెయడమే కాకుండా.. రుద్రనిల్ ఘోష్ పై కూడా దాడి చేశారు. దీంతో ఆయన గాయాల పాలయ్యారు. భవానీపూర్ ఘటనలో వెలుగులోకి వచ్చిన వీడియోల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు బీజీపీ వర్గం వారిపై ఇటుకలు, రాళ్లతో దాడులకు దిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న పోలీసులకు వారిని అడ్డుకోవడం కష్టంగా మారింది.
ఈ విషయంపై బీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్న తమ అభ్యర్థి రుద్రనిల్ ఘోష్ పై పాశవికంగా టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారన్నారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. అదేవిధంగా రుద్రనిల్, ఆయనతో ఉన్నవారిపై కూడా దాడి చేశారు. దీంతో ఆయన, మరో 15 మంది బీజేపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి అని చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బెంగాల్ లో ఇతర ప్రాంతాల్లో సాగుతున్నట్టు హింసాత్మక చర్యలు రాజధాని కోల్ కతాకు కూడా పాకడం ఆందోళన కలిగిస్తోంది. భవానీపూర్ ఘటన తరువాత దక్షిణ కోల్ కతాలోని చేత్లా నియోజకవర్గ పరిధిలో కూడా టీఎంసీ, బీజేపీ వర్గాల మధ్య దాడులు జరిగాయి. పోలీసులు చెపుతున్న దాని ప్రకారం.. చేత్లాలో బీజేపీ మద్దతుదారులు ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో టీఎంసీ మద్దతుదారులు ఎదురు పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
Also Read: Bengal Elections: బెంగాల్ బరిలో ఉద్ధండులు.. ఎవరెవరి సీట్లు ఏవంటే?