BJP agent dies in West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం ఏదో ఒకచోట హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీఎంసీ శ్రేణులు ఎదురెదురుగా తలపడతున్నాయి. మొత్తం ఎనిమిది దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతలు ముగిశాయి. శనివారం ఐదో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన నాలుగో విడుత ఎన్నికల్లో కూచ్ బెహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ.. ఓ బూత్‌లో బీజేపీ ఏజెంట్ హఠాన్మరణం చెందడం చర్చనీయాంశంగా మారింది. కమర్‌హాతీ ప్రాంతంలోని 107వ నంబర్ పోలింగ్ బూత్‌లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఏజెంట్ హఠాత్తుగా మృతి చెందడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
ఆయన పేరు అభిజిత్, అయితే ఎన్నికలు మొదలవ్వగానే అభిజిత్ కేంద్రం ఆవరణలో మరణించి ఉన్నాడని అతని సోదరుడు తెలిపాడు. తమని వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని సరిగ్గా ఏం జరిగిందో తెలియదని ఆయన పేర్కొన్నాడు. కాగా.. అభిజిత్ మృతిపై నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. సిబ్బందిని ఆదేశించింది. ఉత్తర బర్దమాన్ అసెంబ్లీ పరిధిలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తమ బూత్ ఏజెంట్లపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపించగా.. సీఆర్పీఎఫ్ జవాన్లు పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని టీఎంసీ ఆరోపణలు చేసింది.
పశ్చిమబెంగాల్ ఐదో దశ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 45 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవల కూచ్ బెహార్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో.. పోలీసుల కాల్పుల్లో టీఎంసీకి చెందిన నలుగురు కార్యకర్తలు మరణించారు.
Also Read: