West Bengal Elections 2021 : ఆకాశాన్నంటుతోన్న కోవిడ్ -19 కేసులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి బాధ్యత, ప్రణాళిక, పరిపాలనా సామర్థ్యాలు లేవని ఆమె తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. అంతేకాదు, నరేంద్రమోదీ పూర్తి అసమర్థతతో ఎలాంటి ముందస్తు ప్రణాళిక చేయకపోవడమే ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభణకు కారణమని ఆమె విమర్శించారు. భారతదేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 ఉధృతి కారణంగా పశ్చిమ బెంగాల్‌లో తాను ఎన్నికల ప్రచారం నిర్వహించనని, ఈ అంశాన్ని అన్ని పార్టీలూ అనుసరించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కొన్ని గంటలకే మమత పై విధంగా మోదీపై విరుచుకుపడ్డారు.
అంతేకాదు, రాహుల్ సూచన ప్రకారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకున్నారు. కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీల్లో మమత పాల్గొనరని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియెన్ తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలోనే మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అయితే, ఇతర జిల్లాల్లో 30 నిమిషాలకు మించకుండా ర్యాలీలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి మమత నిర్ణయించారని టీఎంసీ సీనియర్ నాయకుడు తెలిపారు.