Bengal Elections Important Constituencies: బెంగాల్ ఎన్నికల పర్వంలో ఆల్‌రెడీ మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇంకో అయిదు విడతల పోలింగ్ మిగిలింది. మే 2వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉద్ధండ నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కీలక స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు.. వారిలో ఎవరిని విజయలక్ష్మి వరించనున్నది.. అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.
బెంగాల్‌లో కీలక అసెంబ్లీ నియోజకవర్గాల ప్రస్తావన వస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది నందిగ్రామ్ గురించే. 2009లో భూ ఉద్యమాలతో యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ నుంచి సాక్షాత్తు బెంగాల్ సిట్టింగ్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగడంతో అందరి దృష్టి నందిగ్రామ్ ఫలితంపైనే వుంది. నందిగ్రామ్ నుంచి మమత స్వయంగా బరిలోకి దిగడానికి పెద్ద కారణమే వుంది. 2009లో భూ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్‌కు స్థానిక నేత సువేందు అధికారి సారథ్యం వహించాడు. ఆ తర్వాత ఆయన అక్కడ్నించి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2016 ఎన్నికల్లో ఆయనే నందిగ్రామ్ నుంచి అసెంబ్లీకి ఎన్నికై.. రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ టూ గా వెలుగొందాడు. కానీ 2021 ఎన్నికలు వచ్చే సరికి ఆయనకు బీజేపీ గాలమేసింది.
బీజేపీలో చేరిన సువేందు అధికారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ నుంచే అసెంబ్లీ ఎన్నికల బరిలో మరోసారి నిలిచారు. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్న దీదీ.. తాను గతంలో పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గాన్ని వదిలేసి.. నందిగ్రామ్ బరిలోకి దిగారు. నిజానికి నందిగ్రామ్ ఏరియాపై సువేందు అధికారికి పూర్తి పట్టుంది. దాన్ని బ్రేక్ చేసేందుకు ప్రస్తుతం దీదీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా తనకు తగిలిన చిన్న దెబ్బను పెద్దదిగా చూపిస్తూ.. భారీ బ్యాండేజీ కట్టుతోనే ఎన్నికల పర్వాన్ని ఈదుతున్నారు దీదీ. ఒంటి కాలుతో బెంగాల్‌లో విజయం సాధించి.. రెండు కాళ్ళతో ఢిల్లీని ఢీకొడతానని మమతా బెనర్జీ భీషణ ప్రతిఙ్ఞ కూడా చేసేశారు.
క్రిష్ణా నగర్ ఉత్తర్… బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ పోలీ చేస్తుండడంతో క్రిష్ణానగర్ ఉత్తర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తొలుత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ముకుల్ రాయ్.. మమతా బెనర్జీ వెంట నడిచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో భాగస్వామి అయ్యాడు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో జగత్ దల్ సీటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2006 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యునిగా ముకుల్ రాయ్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే.. 2015లోనే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. తన రాజ్యసభ పదవీ కాలం ముగిసే వరకు మిన్నకుండిపోయిన ముకుల్ రాయ్.. తన రాజ్యసభ సభ్యత్వం ముగియగానే భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన క్రిష్ణా నగర్ ఉత్తర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కాగా ముకుల్ రాయ్‌పై తృణమూల్ పార్టీ తరపున బెంగాలీ సినీ నటి కౌశానీ ముఖర్జీ పోటీ చేస్తుండగా.. లెఫ్ట్ ప్రంట్ తరపున కాంగ్రెస్ అభ్యర్థి సల్వియా సాహ బరిలో వున్నారు.
జాదవ్ పూర్… సీపీఎం తరపున సుజన్ చక్రవర్తి బరిలోకి దిగడంతో జాదవ్ పూర్‌పై బెంగాల్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా.. జీవ వైద్య శాస్త్రవేత్తగా ఆయనకు పేరుంది. 2004 నుంచి 2009 వరకు సుజన్ చక్రవర్తి సీపీఎం పార్టీ తరపున లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కాగా సుజన్ చక్రవర్తిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున మూలోయ్ మజుందార్, బీజేపీ తరపున రింకు నాస్కా ఎన్నికల బరిలో వున్నారు. బెంగాలీ సినీ నటుడు యాష్ దాస్ గుప్తా పోటీ చేస్తుండడంతో చండితాలా నియోజకవర్గం అందరి దృష్టిలో పడింది. కాగా ఇక్కడ్నించి సీపీఎం పార్టీ తరపున సీనియర్ నేత మహ్మద్ సలీం బరిలో వున్నారు. ఆయన సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు. 1990 నుంచి 2001 వరకు మహ్మద్ సలీం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహ్మద్ సలీం లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 వరకు ఎంపీగా కొనసాగారు. ప్రస్తుతం మరోసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. కాగా అధికార తృణమూల్ కాంగ్రెస్ తరపున ఇక్కడ్నించి స్వాతి ఖండకర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
టోలిగంజ్.. బాబుల్ సుప్రియో వంటి జగమెరిగిన నేత బరిలోకి దిగడంతో టోలి గంజ్ నియోజకవర్గం రెగ్యులర్‌గా మీడియాలో నానుతోంది. సుప్రియో బీజేపీ తరపున పోటీ చేస్తుండగా ఆయనపై అరూప్ బిశ్వాస్ (తృణమూల్), దేవదత్ గోష్ (సీపీఎం) పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున భారతి ఘోష్ బరిలోకి దిగడంతో దెబ్రా నియోజకవర్గం కూడా తరచూ వార్తల్లో కనిపిస్తోంది. ఇక్కడ్నించి తృణమూల్ తరపున హుమాయున్ కబీర్, సీపీఎం నుంచి ప్రాణక్రిష్ణ మండల్ ఎన్నికల్లో పోటీకి దిగారు. బాంకురా నియోజకవర్గం కూడా ప్రస్తుతం బెంగాల్ ఎన్నికల్లో తరచూ వార్తలకెక్కుతోంది. బాంకురా నుంచి తృణమూల్ నుంచి సయంతికా బెనర్జీ, బీజేపీ నుంచి నీలాద్రి శేఖర్ దానా, కాంగ్రెస్ నుంచి రాధా రాణి బెనర్జీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ALSO READ: చర్చలకు రెడీ అంటున్న మావోయిస్టులు.. ఘోర రక్తపాతం తర్వాత సాధ్యమేనా?