అమరావతి, జూన్ 4: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి జనసేన పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. పదేళ్ల ప్రస్తానంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుపొందని జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది అశ్యర్యపరిచింది. ఇక జనసేన నేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి మెజారీ ఆధిక్యతతో గెలుపొందారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
‘ఇది కక్ష్య సాధింపు విజయం కాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 5 కోట్ల మంది ప్రజలకు చెబుతున్నా.. ఆ చీకటి రోజులు అయిపోయాయి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండవల్సిన సమయం ఇది. సినిమాల్లో ఉన్నప్పుడు తొలిప్రేమ అనే మువీతో విజయం సాధించాను. ఈ రోజు 21 స్థానాలకు 21 గెలిచేవ వరకు మళ్లీ గెలుపు రుచి చూడలేదు.
గెలిచింది 21 స్థానాలే.. కానీ 175 స్థానాలు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజు. బాధ్యతతో మేం పనిచేస్తాం. వ్యవస్థల్లో రాజకీయ నేతల ప్రమేయం అతితక్కువ ఉండేలా మేం చర్యలు తీసుకుంటాం. మెగా డీఎస్సీ ప్రకటించే బాధ్యత నాది. చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు నాకు. 2019లో ఓడిపోయినప్పుడు ఎలా ఉన్నానో .. ఈరోజు కూడా అదే మానసిక స్థితిలో ఉన్నాను. గెలుపు నాలో అహంకారాన్ని పెంచలేదు. ఇల్లు అలకగానే పండగగాదు. గెలుపు బాధ్యత పెంచింది. ధర్మం కోసం నిలబడితే అదే ధర్మం ఈ రోజు మన వెంట నిలబడింది. కనిపించని దేవుళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను మాత్రమే గెలిపించలేదు. 5 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలిపించారు’ అంటూ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.