జంక్‌ఫుడ్స్‌తో తస్మాత్‌ జాగ్రత్త !

diet rich in junk food may negatively impact spatial memory study, జంక్‌ఫుడ్స్‌తో తస్మాత్‌ జాగ్రత్త !
పల్లె, పట్నం అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు. ఏ ఏరియా చూసినా, ఏ గల్లీకి వెళ్లిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు తప్పక దర్శనమిస్తాయి. స్కూల్‌ పిల్లలు మొదలు వృద్దుల వరకు అందరూ ఈ జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడిపోతున్నారు. అసలీ జంక్ ఫుడ్స్ అంటే ఏంటీ..? ఎందుకు అందరూ జంక్‌ఫుడ్‌నే అంతగా ఇష్టపడతారు..అంటే..ఇక్కడే ఉంది అసలు మజా..! వీటిలో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా నోటికి చాలా రుచికరంగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా వాటిని తయారు చేయడంలో ఆహార సంస్థలు విజయం సాధించాయనే చెప్పాలి.నిజానికి, జంక్ ఫుడ్స్ అంటే సరైన క్యాలరీస్ లేని అనారోగ్యకరమైన ఆహారపదార్ధాలనే  విమర్శలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒక్కసారి జంక్ ఫుడ్స్ ని తింటే పరవాలేదు కానీ.. అదే అలవాటుగా తింటే మాత్రం అది తప్పక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని యుఎన్‌ఎస్‌డబ్ల్యూ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ పత్రికలో ప్రత్యేక కథనం ప్రచురించబడింది.

ఈ తాజా అధ్యయనం మేరకు జంక్ ఫుడ్స్ బాగా తినడం మూలానా శారీరక, భావోద్వేగ పరిణామాలు ఎదురుకొవాల్సి వస్తుందని, జ్ఞాపక శక్తి సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని పరిశోధకులు స్పష్టం చేశారు. వారి అధ్యయనంలో భాగంగా ఆరోగ్యకరమైన వ్యక్తులు జంక్ ఫుడ్ ని వరుసగా ఐదు రోజులు తిన్నారు. ఆ తరువాత, వారిలో జ్ఞాపకశక్తి సమస్యలు మొదలయ్యాయి. దాంతో, వరుసగా ఐదు రోజులు జంక్ ఫుడ్ ని తింటే జ్ఞాపకశక్తి క్షీణించే అవకాశం ఉందని ఆ అద్యయనం తేల్చింది.మెదడు పని తీరులో మార్పులు చోటు చేసుకునేలా చేసే చక్కర, కొవ్వు వంటివి జంక్ ఫుడ్స్ లో అధికంగా ఉంటాయి. అందువల్ల, ఒకసారి ఈ ఆహార పదార్థాలకు అలవాటు పడిన వారు మళ్ళీ మళ్ళీ తినాలని కోరుకుంటారు. శరీరానికి సరైన పోషకాలు అందకపోతే ఒత్తిడిగా అనిపిస్తుంది. ఆ ఒత్తిడి తగ్గించుకోలేక డిప్రెషన్ కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా, ఒత్తిడి తగ్గించుకుని సౌకర్యంగా ఉండడానికి తిరిగి ఈ జంక్ ఫుడ్స్ పైనే ఆధారపడుతూ ఉంటారు చాలా మంది. ఈ విధంగా తెలియకుండానే జంక్ ఫుడ్స్ తినే అలవాటు చేసుకుంటారు. ఈ విధంగా డిప్రెషన్, ఒత్తిడి స్థాయిల్ని జంక్ ఫుడ్స్ పెంచుతాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటే ఫాటీ ఆసిడ్స్ అసమతుల్యత కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ కారణంగా కూడా జంక్ ఫుడ్స్ ని ఎక్కువ తినేవారు డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది.జంక్ ఫుడ్స్ ని తరుచూ తింటే వాటి నుంచి వచ్చే కొవ్వులు శరీరంలో పేరుకుపోయి.. ఉబకాయ సమస్యని పెంచుతుంది. అధిక బరువు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

వేయించిన ఆహారం, చిప్స్ లో ప్రాసెస్ చేయబడిన ఉప్పు శాతం అధికంగా ఉండటంతో.. అధిక చెడు కొవ్వులు, సోడియం వంటివి రక్తపోటుని పెంచి మూత్రపిండాల పనితీరుని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. దీంతో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా రకరకాల జబ్బులు, వ్యాధుల బారిన పడవలసి వస్తుంది. ఇవి కాలేయం పనితీరును కూడా దెబ్బతీస్తాయి. మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువే.. జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా తగ్గేలా చేస్తాయి. ఇంతటీ అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నజంక్‌ఫుడ్స్‌కి దూరంగా ఉండగలిగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *