కర్నూలు జిల్లాలో వజ్రాల వేట..నెల రోజుల్లో 28 విలువైన వజ్రాలు

తొలకరి మొదలైంది. తొలకరి జల్లులు కురిస్తే అంతా పొలం పనులు మొదలు పెట్టాలని భావిస్తారు కానీ కర్నూలు జిల్లా రైతులు మాత్రం వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. వరుణుడి కరుణతో ఈ ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమ నాట రతనాలు బయటపడుతున్నాయి.

  • Jyothi Gadda
  • Publish Date - 7:35 pm, Fri, 11 September 20

తొలకరి మొదలైంది. తొలకరి జల్లులు కురిస్తే అంతా పొలం పనులు మొదలు పెట్టాలని భావిస్తారు కానీ కర్నూలు జిల్లా రైతులు మాత్రం వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. వరుణుడి కరుణతో ఈ ఖరీఫ్ సీజన్‌లో రాయలసీమ నాట రతనాలు బయటపడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు..నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 28 విలువైన వజ్రాలు లభించినట్లుగా తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో నెల రోజుల్లో మూడు అత్యంత విలువైన వజ్రాలు దొరకడంతో జొన్నగిరి తుగ్గలి, పగిడిరాయి, మద్దికేర, పెరవలిలో వజ్రాల వేట ఊపందుకుంది. కేవలం పొలంలో కూలి పనులు చేస్తున్న వారికే వజ్రాలు లభ్యం కావడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెరవలి గ్రామానికి చెందిన మహిళ పొలం పనులు చేస్తుండగా ఐదు క్యారెట్ల వజ్రం లభించింది. ఆ దొరికిన వజ్రాన్ని రూ.3,20,000 నగదుతో పాటు జత బంగారు చెవి కమ్మలకు పెరవలికి చెందిన వ్యాపారి కొనుగోలు చేశారు.

మరో వజ్రం పగిడిరాయి గ్రామానికి చెందిన మహిళకు పొలంలో పనులు చేస్తుండగా దొరికింది. ఆ వజ్రం విలువ రూ. 12,00000లు విలువ చేసింది. గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. తుగ్గలిలో రూ. 15,00000 విలువ చేసే మరో వజ్రం లభ్యం కాగా, జొన్నగిరికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం నెల రోజుల వ్యవధిలోనే మూడు విలువైన వజ్రాలు లభించడంతో ప్రజల దృష్టి అంతా వజ్రాలపైనే పడింది. వర్షం పడిందంటే చాలా పొలాల బాటపడుతున్నారు.

ఈ యేడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు పుష్కలంగా రావడంతో దాదాపుగా పబ్లిక్‌గా 28 విలువైన వజ్రాలు లభించినట్లు సమాచారం. గత వారం రోజుల క్రితం రూ. 1,20,00000 విలువైన వజ్రం ఓ రైతు పొలం పనులు చేస్తుండగా దొరికింది. ఆ దొరికిన వజ్రాన్ని గుత్తి, జొన్నగిరి, పెరవలి వ్యాపారస్తుల పోటీలో గుత్తికి చెందిన వ్యాపారి దక్కించుకున్నట్లు సమాచారం.

విలువైన వజ్రాలు లభిస్తుండటంతో వ్యాపారులు కుమ్మకై ఎక్కువ విలువ చేసే వజ్రాలను తక్కువ ధరలకు కొనుగోు చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో కూలీలకు రోజుకో వజ్రం లభిస్తుండటంతో పంట పొలాలకు వెళ్లే కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.