
దేశంలో బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ఎయిర్‌పోర్టులే టార్గెట్‌గా బెదిరింపులకు పాల్పడిన దుండగులు ఇప్పుడు స్కూళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. దేశంలో ఉగ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయనే అనుమానాల నేపథ్యంలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. సోమవారం ఉదయం ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు.
ఢిల్లీలోని చాణక్యపురిలో గల నేవీ స్కూల్, ద్వారక ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. రెండు పాఠశాలలకు మెయిల్స్ చేసిన ఆగంతకులు స్కూల్స్ ఆవరణలో బాంబులు పెట్టినట్లు ఏ క్షణంలోనైనా పేల్చాస్తామని ఆ మెయిల్స్ సారాంశం. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో రంగంలోకి దిగారు. రెండు పాఠశాలల్లోనూ తనిఖీలు చేపట్టారు ఢిల్లీ పోలీసులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా అణువణువు తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు ప్రకటకించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.