సికింద్రాబాద్‌లో పేలిన సిలిండర్లు..వలస కూలీల గుడిసెలు దగ్ధం

హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్‌ బోయిన్ పల్లిలోని బాపూజీ నగర్‌లో అపార్ట్‌మెంట్ల మధ్యలో ఉన్న గుడిసెలో సిలిండర్ పేలటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో...అపార్ట్ మెంట్ల ..

సికింద్రాబాద్‌లో పేలిన సిలిండర్లు..వలస కూలీల గుడిసెలు దగ్ధం

Updated on: May 29, 2020 | 4:40 PM

హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్‌ బోయిన్ పల్లిలోని బాపూజీ నగర్‌లో అపార్ట్‌మెంట్ల మధ్యలో ఉన్న వలస కూలీలు వేసుకున్న గుడిసెలు మొత్తం తగలబడ్డాయి. పట్టపగలు ఓ గుడిసెలోని సిలిండరు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు గుడిసె మొత్తానికి అంటుకున్న మంటలు చుట్టుపక్కల ఉన్న మిగతా గుడిసెలకూ వ్యాపించాయి. దీంతో మరో సిలిండర్‌ కూడా పేలింది. అసలే 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నఎండలు, దానికితోడు తీవ్రమైన వడగాడ్పుల ప్రభావానికి మంటలు భారీగా ఎగిపడ్డాయి. రెండు సిలిండర్లు పేలిన సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అపార్ట్‌మెంట్ల మధ్య ఉన్న గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో అరుపులు, కేకలు వేస్తూ.. పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

అయితే, గురువారం మధ్యాహ్నం బాలానగర్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ ఫ్యాన్ల కంపెనీలో మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో రోజు కూడా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎండల తీవ్రత కారణంగా కూడా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందంటున్నారు నిపుణులు. మధ్యాహ్న సమయాల్లో వంట చేసే సమయాల్లో గృహిణులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇక అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో ఎవరూ బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. కార్లు, బైకుల ఇంజిన్ల వేడిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.