వేసిన పథకం బెడిసింది. ఒకరిని చంపాలనుకుని మరొకరికి హతమార్చారు. తీరా విషయం బయటపడి కటకటలాపాలయ్యారు. వివాహేతర సంబంధం కారణంగా ఏ పాపం తెలియని ఓ అమాయకుడ్ని హత్య చేయించింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చంపాలని భావించి.. అది సాధ్యం కాకపోవడంతో అతని బంధువుని హతమార్చారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అసలు నిందుతలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులని కరీంనగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఆటోనగర్ వద్ద ఈ నెల 10న జరిగిన ట్రాక్టర్ డ్రైవర్ నర్సయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును చేధించిన వన్ టౌన్ పోలీసులు.. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేల్చారు. మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టిన సీపీ కమలాసన్ రెడ్డి.. ఈ హత్య కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితులు శ్రీనివాస్, శివ, సంబోజీ సాయి కిరణ్ అనే ముగ్గురు కలిసి ఈ హత్య చేశారని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అడ్డగుంట పల్లి కి చెందిన తీట్ల శ్రీనివాస్… తన భార్య కరీంనగర్ లోని ఓ యువకునితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని అనుమానించాడు. దీంతో ఆ యువకున్ని హతమార్చాలని స్నేహితులతో కలిసి ఫ్లాన్ చేశాడు. అయితే తమ ప్రయత్నం సాధ్యం కాకపోవడంతో.. అభం శుభం తెలియని అతని బావ నర్సయ్యను చంపాలని ప్లాన్ వేసాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలసి ఈనెల 10న తెల్లవారు జామున ఇసుక నింపేందుకు ట్రాక్టర్ తో పాటు వచ్చిన నర్సయ్యను.. శ్రీనివాస్ కాపుకాసి మారణాధులతో దారుణంగా నరికి చంపారు. పెద్దపల్లి జిల్లా పెద్దకల్వల గ్రామానికి చెందిన కారెంగుల శివ, కరీంనగర్ సుభాష్ నగర్ కు చెందిన సంబోజీ సాయికిరణ్ శ్రీనివాస్ కు సహకరించినట్టు కరీంనగర్ సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు, ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల గుట్టురట్టైనట్లు సీపీ పేర్కొన్నారు.