Balakrishna arrested for stealing vehicles : తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీసులు ఓ మహా కేటుగాడ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 27 పైచిలుకు బైక్స్ ను ఘరానాగా ఎత్తేసిన దొంగను ఎట్టకేలకు దొరకబుచ్చుకున్నారు. ఇక్కడ వింతేంటంటే, దొంగిలించిన బైక్ లతో సహా నిందితుడ్ని పోలీసులు పట్టుకోవడం. రాజోలు పోలీస్ సర్కిల్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో చోరికి గురైన 27 ద్విచక్ర వాహనాలను దొంగిలించిన ఈ జాదూబాబుని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిని ఈ రోజు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఇంత భారీగా దొంగ వాహనాలను రికవరీ చేయడం ఇదే ప్రథమమని ఈ సందర్భంగా డీఎస్పీ చెప్పారు. నిందితుడు అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన నల్లి బాలకృష్ణ(26) అని చెప్పిన పోలీసులు.. దొంగను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. క్రికెట్ బెట్టింగ్స్, త్రాగుడు, పేకాట వంటి వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలకు అలవాటుపడిన బాలకృష్ణ… దొంగిలించిన వాహనాలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.