Robbery : గుంటూరులో పట్టపగలే లక్షల రూపాయల దోపిడీ జరిగింది. స్థానిక మిర్చి యార్డులో గుమస్తాగా పనిచేసే కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్ బ్యాంకులో 9 లక్షల రూపాయలు డ్రా చేశాడు. డబ్బు సంచిని స్కూటర్ డిక్కీలో ఉంచాడు. దారిలో టిఫిన్ సెంటర్ కి వెళ్లి టిఫిన్ చేశాడు. అనంతరం తన దుకాణానికి వెళ్లాడు. దుకాణం దగ్గర స్కూటర్ డిక్కీ తెరిచి డబ్బు కోసం చూడగా డబ్బు సంచి కనిపించలేదు. దీంతో డబ్బు చోరీకి గురైందని గ్రహించి హుటాహుటీన లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సదరు వ్యాపారి వెళ్లిన దారిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. ఒక సీసీ కెమెరాలో వెహికల్ లోని డబ్బును ఓ వ్యక్తి దొంగిలించడాన్ని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.