మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను మహబూబాబాద్ జిల్లా ప్రధాన వైద్యశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవితలు పరామర్శించారు.
ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తాగి ఉండడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెళ్లి కావలసిన ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయన్నారు. చనిపోయిన వారిలో డ్రైవర్ రమేష్ కు ఆర్. ఓ. ఎఫ్. ఆర్ పట్టా ఉంది, కానీ కార్డు లేదని, అయినప్పటికీ తమ శాఖ తరపున రాము కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
మృతదేహాల అంత్యక్రియలకు మంత్రి సత్యవతి రాథోడ్ ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆరుగురికి రూ.60 వేలు, ఎంపీ కవిత ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ఆరుగురికి 30 వేల రూపాయలు వారి వ్యక్తిగతంగా అందజేశారు. వెంటనే అంబులెన్స్ లు ఏర్పాటు చేసి, మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, హాస్పిటల్ సూపరింటెందెంట్ భీమ్ సాగర్, గూడూరు జెడ్పీటీసీ సుచిత్ర, టి.ఆర్.ఎస్ నేతలు భరత్ కుమార్ రెడ్డి, పరకాల శ్రీనివాస రెడ్డి, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు.