ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా మహిళలు చిన్నారులపై నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఒంటరిగా ఉన్న మహిళలపై (Women) ఈ తరహా ఘటనలు మరింత అధికమయ్యాయి. ప్రస్తుతం మచిలీపట్నంలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తనతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలని లేదంటే అంతు చూస్తానని బెదిరించడంతో గత్యంతరం లేక బాధితురాలు అతను చెప్పిందల్లా చేసింది. చివరకు వలలో చిక్కుకుని విలవిల్లాడింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరానికి (Rajamahendravaram) చెందిన ఓ మహిళకు పెళ్లయింది. కొన్ని కారణాలతో ఆమె తన భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి వేరుగా జీవిస్తోంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు చిన్నపాటి దుకాణం నడుపుతోంది. ఈ క్రమంలో ఆమె తన వ్యాపార అవసరాల కోసం హన్సకుమార్ జైన్ అనే వ్యక్తి నుంచి అప్పు తీసుకునేది. జైన్ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుండటంతో అవసరం ఉన్న వారందరూ అతని వద్దే డబ్బు తీసుకునేవారు. కొన్ని రోజుల క్రితం మహిళ మరోసారి అప్పు కావాలని జైన్ ను అడిగింది. దీంతో జైన్ వడ్డీ ఎక్కువ అవుతుందని అలా అయితేనే తీసుకోవాలని తేల్చి చెప్పాడు. లేకుంటే నగ్నంగా తనతో వీడియోకాల్ చేయాలని, గెస్ట్‌హౌస్‌కు రావాలని ఒత్తిడి చేశాడు. గత్యంతరం లేకపోవడంతో ఆమె అందుకు ఒప్పుకుని జైన్ కు నగ్నంగా వీడియో కాల్ చేసింది.
ఇదే అదనుగా భావించిన హన్సకుమార్ ఈ వ్యవహారాన్ని స్క్రీన్ రికార్డర్ సహాయంతో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను విజయవాడలో ఉంటున్న అతని బంధువు చందు చూశాడు. క్లిప్ ను తన ఫోన్, ల్యాప్‌టాప్‌లోకి షేర్ చేసుకున్నాడు. వీటిని పోర్న్ సైట్లలోకి అప్‌లోడ్ చేసి, వాటి లింక్‌ను బంధువులకు పంపిస్తానంటూ చందు బాధితురాలని బెదిరించాడు. ఆమె నమ్మకపోవడంతో వీడియో స్క్రీన్ షాట్ తీసి బాధితురాలికి పంపించాడు. అంతటితో ఆగకుండా తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో ఏమీ చేయలేని స్థితిలో బాధితురాలు మచిలీపట్నంలో పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ కేసును జీరో ఎఫ్‌ఐఆర్ గా చేసిన పోలీసులు.. మహిళా పోలీసు స్టేషనుకు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చందు, జైన్‌ను అరెస్టు చేశారు.
మరిన్ని నేర వార్తల కోసం చూడండి..