Andhra Pradesh: అనంత గ్రామీణం పోవరనంకు చెందిన కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌బీ అనే మహిళ 22 జనవరి 1986న అనారోగ్యంతో చనిపోయారు. కానీ.. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఆమె పేరుపై ఉన్న ఆస్థి 2022 జనవరి 5న అమ్మటం జరిగింది. అసలు ఎప్పుడో చనిపోయిన వ్యక్తి.. ఇప్పుడు ఆస్తి అమ్మటం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..? ఇదే అనుమానం అందరికీ కలిగింది. అసలు విషయం ఏమిటంటే.. అక్రమార్కులు అదే పేరు కలిగిన మరో వృద్ధురాలితో కోట్ల రూపాయల విలువైన భూమిని విక్రయించినట్లు రిజిస్ట్రేషన్(Registration) చేయించుకున్నారు. అసలు వారసులు తమ భూమిని అమ్మేందుకు వెళ్లినప్పుడు ఈ వ్యవహారం బయటపడింది. నగరానికి చెందిన మహబూబ్‌బీ 1960లో అనంతపురంలోని పొలం సర్వే నెం.404-1Aలో 16 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం JNTU సమీపంలోని భైరవనగర్‌లో ఉంది. 1986లో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఉమ్మడిగా ఉన్న ఈ ఆస్తిని భాగాలు చేయకుండా విక్రయించాలని అనుకున్నారు. ప్రస్తుతం ఈ స్థలం మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ. 1.60 కోట్లుగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న ఈ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది.
పక్కా ప్లాన్ ప్రకారం..
మహబూబ్‌బీ మృతి చెందినట్లు తెలుసుకున్న కబ్జాదారులు.. ఆమె పేరుపై 344419836694 నంబరుతో ఒక నకిలీ ఆధార్‌కార్డును సృష్టించారు. ఈ కార్డు మార్ఫింగ్ చేశారు. ఆమె వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ దస్తావేజులను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సదరు స్థలాన్ని నగరంలోని విద్యుత్తునగర్‌కు చెందిన ఎస్.మహబూబ్‌బీ అనే 81 ఏళ్ల వృద్ధురాలు జనవరి 5న పెద్దపప్పూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రవిప్రసాద్‌రెడ్డి తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలియని అసలు వారసులు రెండురోజుల క్రితం భూమి విక్రయానికి పెట్టారు. ఒప్పంద పత్రం రాసుకున్న తర్వాత ఈసీ తీసుకున్నారు. సదరు భూమి ఇప్పటికే వేరొకరికి విక్రయించినట్లు తెలియడంతో నివ్వెకరోయారు. దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లనింటినీ బయటకు తీయగా అసలు విషయం తెలిసింది. బోగస్ ఆధార్‌కార్డు సృష్టించి తమ ఆస్తిని కొల్లగొట్టినట్లు వారు గ్రహించారు. సాక్షులుగా సుదర్శన్‌రెడ్డి, రామాంజనేయులు అనే వ్యక్తులు సంతకాలు చేసినట్లు తెలుసుకున్నారు. దీనిపై బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ దస్తావేజు లేఖరి అండతో ఇదంతా జరిగిందా? లేక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది సహకారంతో ఇలా చేశారా అనే విషయం అధికారులు నిగ్గుతేల్చాల్సి ఉంది. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ హరివర్మను అడగగా.. తన దృష్టికి ఈ విషయం రాలేదని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించిన తరువాత విచారణ జరపనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి..
Multibagger Stock: లక్ష పెట్టుబడిని రూ.10 కోట్లుగా మార్చిన బంపర్ స్టాక్.. మీరు కొన్నారా..
APSRTC: ఆ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఏడు వేల మందికి ఎలక్ట్రిక్ వాహనాలు..!