Crime: జైలులో శిక్ష అనుభవిస్తున్న భర్త ఓ వైపు.. ఒడిలో కుమారుడి మృతదేహం మరోవైపు.. గుండె బరువెక్కిస్తున్న ఘటన

| Edited By: Ravi Kiran

Aug 17, 2022 | 3:45 PM

ఓ కేసులో ఇరుక్కున్న భర్త ఏడు నెలలుగా జైలులోనే.. మరోవైపు నిండు గర్భంతో ఆస్పత్రిపాలైన భార్య. ఆ బాధనంతా దిగమింగి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినా ఆమెలో సంతోషం కొంత సమయమైనా నిలవలేదు. శిశువు అనారోగ్య కారణాలతో చనిపోయాడు....

Crime: జైలులో శిక్ష అనుభవిస్తున్న భర్త ఓ వైపు.. ఒడిలో కుమారుడి మృతదేహం మరోవైపు.. గుండె బరువెక్కిస్తున్న ఘటన
Child Death
Follow us on

ఓ కేసులో ఇరుక్కున్న భర్త ఏడు నెలలుగా జైలులోనే.. మరోవైపు నిండు గర్భంతో ఆస్పత్రిపాలైన భార్య. ఆ బాధనంతా దిగమింగి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినా ఆమెలో సంతోషం కొంత సమయమైనా నిలవలేదు. శిశువు అనారోగ్య కారణాలతో చనిపోయాడు. చిన్నారి మృతదేహాన్ని భర్తకు చూపించేందుకు వెళ్లిన భార్యకు తీవ్ర ఆవేదనే ఎదురైంది. ఈ హృదయవిదారక ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని వశిష్ట్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని బందర్చువాన్ గ్రామానికి చెందిన చుమన్ మహ భార్య ఫూల్ దేవి గర్భిణీ. ఆమెకు పురుటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పూల్ దేవి ని పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రసవం చేశారు. ఈ క్రమంలో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువుకు ఉన్నట్టుంటి ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఉండే గ్రామానికి, ఆస్పత్రికి మధ్య చాలా దూరం ఉండటంతో రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లలేక చిన్నారిని రాత్రంతా జాగ్రత్తగా చూసుకున్నారు. ఉదయాన్నే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధరించారు. మరో వైపు.. పూల్ దేవి భర్త చుమన్ మహా ఓ కేసులో ఏడు నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పటికీ అతను జైలులోనే ఉన్నాడు. దీంతో భార్య పూల్ దేవి బిడ్డ మృతదేహాన్ని భర్తను చూపించేందుకు జైలుకు పయనమైంది.

ఆదివారం ఉదయం 8 గంటలకు జైలు ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంది. బిడ్డ మృతదేహాన్ని పట్టుకుని రోదిస్తూ తన భర్తను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను ప్రాధేయపడింది. అయినా ఆమె ఆవేదనను ఏ ఒక్కరు పట్టించుకోలేదు. ఎంత బతిమిలాడినా లోపలకి అనుమతించలేదు. చివరకు చేసేదేమి లేక పూల్ దేవి తన బిడ్డ మృతదేహాన్ని భర్తకు చూపించకుండానే స్వగ్రామానికి పయనమైంది. ఈ ఘటనపై ఛత్రా జైలు అధికారి దినేష్ వర్మ స్పందించారు. వెంటనే డివిజనల్ జైలు సూపరింటెండెంట్‌ తో మాట్లాడారు. జైలు నియమాల ప్రకారం ఆదివారం ఖైదీలను కలిసే అవకాశం లేనందున, ఆ మహిళ తన భర్తను కలవలేకపోయిందని వెల్లడించారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి