దేశ రాజధాని ఢిల్లీలో మరిన్ని బాంబు దాడులు జరగబోతున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటన తర్వాత లభ్యమైన లేఖలో.. రోజులు లెక్కపెట్టుకోండి.. పెద్ద పత్రీకారం కోసం సిద్ధంగా ఉండండి అని రాసి ఉండడం తాజాగా కొత్త కలకలం రేపుతోంది. జనవరి 29న జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ-NIA దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను గుర్తించారు. దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ పర్యవేక్షిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన హింస ఘటనతో రోడ్లపై భారీ ఎత్తున మేకులు, గోడలు, బారికేడ్ల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఈ నెల 6న రైతులు సడక్ బంద్‌కు పిలుపునివ్వడంతో.. భద్రతా దళాలు ఆందోళనకారుల కట్టడికి ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా, ఢిల్లీ బాంబు ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వాణిజ్య రాజధాని ముంబయితోపాటు, రాష్ట్రంలోని అనేక కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.