GHMC BJP Corporator Ramesh Goud Died Of Covid-19: కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగోజీగూడ బీజేపీ కార్పొరేటర్ రమేష్ గౌడ్ కరోనాతో గురువారం మృతి చెందారు. గత కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడిన ఆయన.. కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రమేష్ బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.
కాగా, వారం రోజుల కిందట కరోనా బారిన పడిన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందినా లాభం లేకుండా పోయింది. గతంలో రమేష్ ఎల్బీనగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాగా, లింగోజీగూడ నుంచి రమేష్ గౌడ్ పోటీ చేసి తన ప్రత్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ టీఆర్‌ఎస్ నతే ఎం. శ్రీనివాసరావు పై గెలుపొందారు. ఇక్కడ మొత్తం 8 మంది పోటీ చేయగా, బీజేపీ, టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతరులు పోటీలో ఉండగా, ప్రజలు రమేష్ గౌడ్‌కు పట్టం కట్టారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించడం అందరిని కలచివేస్తోంది.