Cyber Criminals: కోవిడ్ పేరుతో పెరుగుతున్న ఘరానా మోసాలు.. ఆన్‌లైన్‌ వేదికగా లక్షలు కాజేస్తున్న కేటుగాళ్లు

|

May 28, 2021 | 1:56 PM

కరోనా బాధితులకు వైద్యం, మందులు, ఆక్సిజన్, ఆహారం కావలసిన వారు సోషల్ మీడియా వేదికగా సమాచారం, సహాయం కోరుతున్నారు. ఇదే అదనుగా ఆన్‌లైన్‌లో మోసాలు చేసేవారు విజృంభిస్తున్నారు.

Cyber Criminals: కోవిడ్ పేరుతో పెరుగుతున్న ఘరానా మోసాలు.. ఆన్‌లైన్‌ వేదికగా లక్షలు కాజేస్తున్న కేటుగాళ్లు
Cybercriminals Make Big Bucks Amid Covid 19 Crisis
Follow us on

Cyber Criminals Make Big Bucks: కరోనా సమయంలో అవసరాలకు ఆన్‌లైన్‌పై ఆధారపడటం మరింత పెరిగింది. లాక్‌డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి. కరోనా బాధితులకు వైద్యం,  మందులు, ఆక్సిజన్, ఆహారం కావలసిన వారు సోషల్ మీడియా వేదికగా సమాచారం, సహాయం కోరుతున్నారు. ఇదే అదనుగా ఆన్‌లైన్‌లో మోసాలు చేసేవారు విజృంభిస్తున్నారు.

వ్యాక్సిన్ పేరుతో మీ మొబైల్ నంబర్ కు మెసేజెస్ వస్తున్నాయా..? ఆర్థిక సాయం పేరుతో ఫేస్ బుక్ లో ఎవరైనా చాటింగ్ చేస్తున్నారా..? తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదన అంటూ ఆఫర్లు ఇస్తున్నారా..? అయితే జర భద్రం..! మీరు ఏమాత్రం టెంప్ట్ అయినా నిండా మునగడం ఖాయం. కరోనా కాలాన్ని క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు అడ్డగోలుగా ఆన్ లైన్ లో కోట్లు కొల్లగొడుతున్నారు. వ్యాక్సిన్ల పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారు.

విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కు రాత్రి సమయంలో ఓ మెసేజ్ వచ్చింది. తన స్టూడెంట్ కి కరోనా సోకిందని, ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని ఆర్థిక సాయం చేయాలని ఓ మెసేజ్ వచ్చింది. ప్రొఫైల్లో తెలిసిన టీచర్ ఫోటో, వివరాలు ఉండడంతో డాక్టర్ నిజమని నమ్మాడు. చాటింగ్లో పేషెంట్ గురించి తెలుసుకున్నాడు. అవతలి వ్యక్తి ఆపదలో ఉన్నాడని తెలియడంతో విడతల వారీగా 50 వేలు పంపాడు. అయితే, ఆ తర్వాత రోజు ఉదయం టీచర్‌కి కాల్ చేస్తే డాక్టర్ మతిపోయింది. తాను మెసేజ్ చేయడమేంటి.. డబ్బులు అడగమేంటని టీచర్ సమాధానం చెప్పడంతో డాక్టర్ షాకయ్యాడు. షాక్ నుంచి కోలుకున్న వైద్యుడు తాను మోసపోయానని గ్రహించాడు. పేక్ ప్రొఫైల్ సృష్టించిన నేరగాళ్లు.. తెలిసిన వాళ్లలాగ కటింగ్ ఇచ్చి దండిగా దండుకున్నారని తాను మోసపోయానని గ్రహించాడు.

సికింద్రాబాద్ కు చెందిన ఓ మహిళా డాక్టర్‌కు కూడా ఇంచుమించు ఇలాగే మోసపోయింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఓ రోజు లేడీ డాక్టర్ కు మెసేజ్ వచ్చింది. క్లిక్ చేస్తే కెనడాలో డాక్టర్ ఉద్యోగమనే సారాంశం ఉంది. మంచి అవకాశం మించితే దొరకదని డాక్టర్ తొందరపడ్డారు. ఆమె అత్యుత్సాహాన్ని క్యాష్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు దాదాపు 10 లక్షల రూపాయలు కొట్టేశారు.

హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారి మెయిల్ హ్యాక్ చేసి నకిలీ ఈమెయిల్ ద్వారా 23 లక్షలు కాజేశారు. వీరేంద్ర బండారీ అనే వ్యాపారి పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేశారు. తాను కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు 23 లక్షల 60 వేలు ఆన్ లైన్ లో పంపాలని మెయిల్ చేశారు. వ్యాపారి ప్రమేయం లేకుండానే నకిలీ లెటర్ ప్యాడ్ పై ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి బేగంపేట్ యాక్సిస్ బ్యాంకుకి మెయిల్ చేశారు. సంతకం సరిపోవడంతో సైబర్ నేరగాళ్లు చెప్పిన మూడు బ్యాంకు ఖాతాలకు అధికారులు 23 లక్షల 60 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు. మరుసటి రోజు బ్యాంక్ ఖాతా చెక్ చేసి, ఇది సైబర్ కేటుగాళ్ల పనేనని తెలిసింది.

హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తిని ఇలాగే చీట్ చేశారు. తాను ఆసుపత్రిలో ఉన్నానని, తన అకౌంట్ నుంచి అర్జంట్ గా 5లక్షలు బదిలీ చేయాలని, నకిలీ లెటర్‌పై సంతకం చేసి బ్యాంకుకి పంపారు సైబర్ చీటర్స్. నిజమే అనుకుని చెప్పిన బ్యాంకు అకౌంట్ కి రూ. 5లక్షలు ట్రాన్సఫర్ చేశారు కొటక్ మహీంద్ర బ్యాంకు అధికారులు. బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ తగ్గడంతో అనుమానం వచ్చిన బాధితుడు బ్యాంక్ అధికారుల్ని ఆరాతీశాడు. జరిగిన విషయం తెలుసుకుని షాకయ్యాడు. సైబర్ నేరగాళ్ల పనేనని పోలీసులను ఆశ్రయించాడు.

కాగా, కరోనా కష్టాలను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని, జాగ్రత్త వహించమని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also… Corona New Study: కరోనా బాధితులకు దడ పుట్టించే వార్త… ICMR సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి