రెండు రోజుల క్రితమే ప్రారంభించిన విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పెచ్చులూడిపడి విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. దసరా బందోబస్త్‌లో ఉన్న కానిస్టేబుల్ చేయి, భుజానికి గాయాలు తగిలాయి. అతణ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దుర్గాఘాట్ దగ్గరలోని అశోక స్తంభం సెంటర్‌లో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ రాంబాబుగా గుర్తించారు. దుర్గగుడికి వెళ్లే వాహనాలను డైవర్ట్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి.. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ పటిష్టతపై వాహనదారుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మరో సారి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.