AP Sandalwood Stolen: అనంతపురం జిల్లా పెనుగొండ అటవీకార్యాలయంలో దొంగలు పడ్డారు. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 70 లక్షల విలువైన శ్రీగంధం చెక్కలు, గంధం నూనె డబ్బాను మాయం చేశారు. శ్రీగంధం చెక్కల మాయంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరని సామెత. కానీ అనంతపురం జిల్లా పెనుగొండ అటవీకార్యాలయంలో శ్రీగంధం చెక్కల దొంగతనం ఇంటిదొంగల పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు ఉన్నతాధికారులు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు.
పెనుగొండ అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం చెక్కలు, 16లీటర్ల గంధం నూనె డబ్బాను అపహరించారు ఇంటి దొంగలు. దొంగతనానికి గురైన శ్రీగంధం చెక్కలు, గంధం నూనె డబ్బా విలువ 70 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇంత భారీ మొత్తంలో గంధం చెక్కలు మాయమవడంపై అటవీశాఖ ఉన్నతాధికారుల ఫిర్యాదుతో డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో స్పెషల్ టీం విచారణ జరుపుతోంది. ఇంటి దొంగల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఆ అధికారులను శాశ్వతంగా విధుల్లోంచి తొలగించడమే కాకుండా జైలుకు పంపుతామని తెగేసి చెబుతున్నారు అటవీ శాఖ ఉన్నతాధికారులు.
ఇంత భారీ మొత్తంలో సరుకును అటవీ అధికారులకు తెలియకుండా తరలించడం ఎలా సాధ్యమన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గంధం చెక్కలు ఎక్కడికి తరలించారు? ఎక్కడ దాచి ఉంటారన్న కోణంలో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీగంధం చెక్కలను ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు తరలించి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. అదే కోణంలో పలు బృందాలుగా విడిపోయి గంధపు చెక్కల కోసం ఆయా రాష్ట్రాల్లో గాలింపును ముమ్మరం చేశారు పోలీసులు.
Read Also…. Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న మరో భారీ ఫ్లైఓవర్!