Bus Accident In Prakasam District: ఆంధ్రప్రదేశ్‌లో మరో బస్సు ప్రమాదానికి గురైంది. జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వాగులో బస్సు బోల్తా పడి 10మంది మరణించిన సంగతి మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా.. ప్రకాశం జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఓ ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుండి చీరాలకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్దకు రాగానే.. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు అంటుకున్నాయి. గాలి వేగంతో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. తెల్లవారుజామున కావడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు అందరు నిద్ర మత్తులో ఉన్నారు. ఇది గమనించిన బస్సు డ్రైవర్ ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే బస్సులో నుంచి దూకేశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్రయాణీకుల లగేజీ పూర్తిగా దగ్ధమైంది. బస్సులో 8 మంది ప్రయాణికులు, ముగ్గురు బస్సు సిబ్బంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్ని మాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also… South Sudan: మనవాళిపై పగబట్టిన వైరస్‌లు.. ఆఫ్రికాలో వింత వ్యాధి.. 100మంది మృతి..