క్షణికావేశంలో ఒకరి నిండు ప్రాణం పోయింది. అభయం శుభం తెలియని ఎనిమిది నెలల చిన్నారిని ప్రాణాపాయంలోకి నెట్టింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఉదయ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన బిమల్‌కుమార్ కొద్ది రోజుల కిందట నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడే వంట మనిషిగా పని చేస్తున్నాడు. భార్య ఆర్తి (23)తో పాటు ఎనిమిది నెలల కుమార్తె సిర్టు కుమారి ఉంది.
అయితే కొంత కాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. రెండు రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన చిన్నపాటి గొడవతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆర్తి తలుపు గడియ పెట్టి కూతురును తీసుకుని రెండో అంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ప్రమాదంలో ఆమె తలతో పాటు ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. చిన్నారి కంటి వద్ద, తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్తి మృతి చెందింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read: