కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడగించింది కేంద్రప్రభుత్వం. అప్పటిదాకా ప్రజారవాణాకు వినియోగించే ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో స్వస్థలాలకు దూరంగా ఉంటున్నవారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏలాగైనా స్వస్థలాలకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది కాలినడకన వెళుతుండగా, మరికొంతమంది మాత్రం పోలీసుల కళ్లు గప్పి స్వస్థలాలకు వెళ్లేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అలాగే ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులు గుంటూరు పోలీసులకు పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లా కారంపూడికి చెందిన ముగ్గురు విద్యార్థులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చిక్కుకుపోయారు. ఏలాగైనా తమ స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్న విద్యార్థులు.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు వెళుతున్న ఓ ఖాళీ పాల వాహనాన్ని ఎక్కారు. డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి.. పాల వ్యాన్ లోపల కూర్చొని రహస్యంగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్‌కు చిక్కారు. ముగ్గురు విద్యార్థులతో పాటు లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాన్‌ను కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.