
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనల్లో భారీ సడలింపులు ఇస్తుండటంతో కేసుల సంఖ్య మరింత ఎక్కువైంది. హస్తినలో కరోనా లాక్ డౌన్ ఆంక్షలు భారీగా సడలించడాన్ని వ్యతిరేకిస్తూ.. మళ్లీ కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఢిల్లీలో వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయని, మరికొన్ని రోజులు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయకుంటే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీలో ఇప్పటి వరకు 33 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 984 మంది మరణించారు. ఇటీవల కొద్ది రోజులుగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి ఢిల్లీలో భారీగా ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఢిల్లీలో మళ్లీ కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. జూలై 31 నాటికి దేశ రాజధానిలో 5.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల జరిగిన సమీక్షలో చెప్పిన విషయాన్ని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
మరోవైపు, కరోనా కేసుల్లో భారత్ నాలుగో స్థానానికి చేరువలో ఉంది. బుధవారం(జూన్10న) భారత్‌లో 9996 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.86 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసుల్లో భారత్ ఐదవ స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో బ్రిటన్ 2.90 కరోనా కేసులతో ఉంది. అయితే, రేపటిలోగా భారత్ నాలుగో స్థానంలోకి చేరుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. తాజా సడలింపులతో అంతా బయటకు రావడంతో ప్రజలు భయంగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని, ఇంకొన్నాళ్లైన కష్టాలు పడతాం కానీ, కరోనాను కట్టడి చేయాలంటున్నారు. ఇందుకోసం మరోసారి కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.