Maharashtra Coronavirus Updates: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నమోదైన కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా పదివేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ ఆ మార్క్ దాటాయి. గత 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10,216 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మహారాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఒక్కరోజులో 53 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 6,467 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముంబయి మహా నగరంలో 1,173 కేసులు నమోదు కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. ఇప్పటివరకు 21,98,399 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మహమ్మారి కారణంగా 52,393 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 20,55,951 మంది కోలుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 88,838 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 93.52 శాతంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,66,86,880 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కాగా.. దేశంలో కొత్తగా పెరుగుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే 85 శాతానికి పైగా కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.. మరోవైపు కేసులు కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం పలు రాష్ట్రాలకు సూచనలు సైతం చేస్తోంది.
Also Read: