Krishnapatnam villagers reaction : ఆనందయ్య కరోనా మందు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో కృష్ణపట్నం వాసులు మీడియా ముందుకొచ్చారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు ఆనందయ్య మందు ఇస్తున్నారని.. ఆ కుటుంబం తరతరాల్నుంచి ఆయుర్వేదిక్ మందులు అందిస్తున్నారని కృష్ణపట్నం వాసులు చెబుతున్నారు. పాముకాటు, తేలుకాటుకు కూడా మందు ఇచ్చి ఎన్నో సార్లు బాగుచేశారని గ్రామస్తుడు ఉదయ భాస్కర్ చెప్పారు. శనివారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి కరోనా మందు ఇవ్వడం జరుగుతుందని, తమ గ్రామంలో ఎవ్వరికీ కరోనా రాలేదని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ఆనందయ్య అరవై వేల మందికి పైగా కరోనా మందు ఇవ్వడం జరిగిందన్నారు. శాసన సభ్యుడు కాకాణి గోవర్థన్ రెడ్డి సహకారంతోనే అందరికీ మందు అందిస్తున్నామని, ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యులు ప్రతి నిముషమూ మందును అందరికీ అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా మందును ఆపడం జరగదని ప్రజలందరికీ అందిస్తామని గోవర్థన్ రెడ్డి హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో స్థానికులు సుమంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.