కరోనాతో బాధపడుతున్న వారు మరో మందు వాడేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతిని ఇచ్చింది. వైరస్‌తో బాధపడుతున్న వారు డెక్సామెథాసోన్ స్టెరాయిడ్‌ను ఉపయోగించొచ్చని తెలిపింది. అయితే కేవలం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగులు మాత్రమే ఈ స్టెరాయిడ్ వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. వెంటిలేటర్‌పై ఉన్న వారు, ఆక్సిజన్ సహాయం కావాల్సిన వారు ఎక్కువ ఖర్చుతో కూడుతున్న మిథైల్‌ప్రిడ్నిసోలోన్‌కు బదులుగా తక్కువ ఖర్చుతో కూడిన డెక్సామెథాసోన్‌ని ఉపయోగించవచ్చని తెలిపింది.
కాగా డెక్సామెథాసోన్ స్టెరాయిడ్‌పై బ్రిటన్‌లో అనేక క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టెరాయిడ్ ఉత్పత్తిని పెంచాలంటూ డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల పిలుపునిచ్చింది. అంతేకాదు ఇటీవల ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఓ బృందం కరోనాతో ఆస్పత్రిలో చేరిన 2 వేల మందికి పైగా రోగులకు ఈ స్టెరాయిడ్ ఇచ్చారు. దీని ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న వారు, ఆక్సిజన్ సహాయం అందిస్తున్న వారి మరణాల రేటును 35 శాతం తగ్గించింది. కాగా ఆర్థరైటిస్, అస్తమా లాంటి తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు డెక్సామెథాసోన్‌ను ఉపయోగిస్తుంటారు. తక్కువ ధరకు లభించే స్టెరాయిడ్ గత 60 ఏళ్లుగా మార్కెట్లో లభిస్తోంది.