Oxygen Cylinder: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రెండురోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నా.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నా కేసులు భారీగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. దీంతోపాటు రాష్ట్రంలో వైద్యం పరంగా కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ అందక ఇప్పటికే చాలామంది మరణించారు. దీంతోపాటు వ్యాక్సిన్ కొరత కూడా వేధిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వ్యాక్సిన్ డోసులను అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా కేంద్రాన్ని కోరుతోంది.
ఈ క్రమంలో తమ రాష్ట్రానికి అదనంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహారాష్ట్రలో పరిస్థితులు క్షీణిస్తున్నాయని.. కేంద్రం స్పందించాలని కోరారు. రెమిడేసివర్ ఔషధం, వ్యాక్సిన్ కొరతను కూడా పరిష్కరించాలని ఠాక్రే కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ శనివారం సాయంత్రం స్పందించారు. ట్విట్టర్ వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నలకు బదులిచ్చారు. రాష్ట్రానికి సరిపోయే విధంగా ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా చేస్తామని హర్షవర్ధన్ కేంద్ర ప్రభుత్వం తరుపున హామీ ఇచ్చారు. అలాగే మహారాష్ట్రలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. రాష్ట్రానికి అదనంగా మరో 1,121 వెంటిలేటర్లను అత్యవసరంగా పంపుతున్నట్లు హర్ష వర్ధన్ ట్విట్‌లో పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ముంబై, పూనే తదితర ప్రాంతాల్లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేస్తోంది.
Also Read: