హైదరాబాద్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. గురువారం ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సిబ్బందికి కూడా కోవిడ్ వైరస్ సోకినట్లు నిర్ధారణకావడంతో అందరిలోనూ మరింత ఆందోళన మొదలైంది.
గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఇదే మెడికల్ కాలేజీలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ పీపీఈ కిట్లను ఉపయోగించడంతోపాటు.. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయనకు కరోనా ఎలా సోకిందనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇతడికి ఇక్కడే వైరస్ సోకిందా? లేదంటే భయటనుంచి సంక్రమించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితుడు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నాడని, తెలిసి అతడి కుటుంబ సభ్యుల నుంచి కూడా శాంపిళ్లను సేకరించి టెస్ట్‌కు పంపించారు. గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని తెలియటంతో సిబ్బంది, ప్రొఫెసర్లు ఆందోళనలో పడ్డారు.