
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 514 కేసులు నమోదైనట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,993కి చేరింది. ఈ వైరస్ బారినపడి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 159 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదిలావుంటే.. పాక్‌లో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో గతనెలలో జరిగిన తబ్లీఘీ జమాత్ సమావేశం ద్వారా కరోనా కేసులు ఎక్కువవుతున్నట్లు అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది తబ్లీఘీ సభ్యులను ఇంకా ట్రేస్ చేయలేకపోయినట్లు రెండు రోజుల క్రితమే అధికారులు తెలిపారు. దీంతో వారిలో ఎంత మందికి వచ్చిందన్న దానిపై పాక్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.