
సీబీఎస్ ఈ పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పెండింగ్ పరీక్షలపై నెలకొన్నసందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 10వ తరగతి, 12వ తరగతి మినహా మిగతా తరగతుల వారిని ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేసింది. కాగా, 12వ తరగతి పరీక్షలను జులై 1 నుంచి 15 తేదీ మధ్యలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణపై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జూన్ 17న కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఎస్‌ఈ కౌన్సిల్ రూపేశ్ కుమార్ కోర్టుకు విన్నవిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిపై బోర్డు అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయనున్నట్లు కోర్టుకు విన్నవించారు.