కరోనాను జయించిన 102 ఏళ్ల బామ్మ..అదే ఆమె ఆయుధం?

కరోనా వైరస్ సోకిందనే ఆందోళనతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటే.. అనంతపురం జిల్లాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు మాత్రం కోలుకొని ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యింది.

కరోనాను జయించిన 102 ఏళ్ల బామ్మ..అదే ఆమె ఆయుధం?

Updated on: Sep 06, 2020 | 2:51 PM

కరోనా వైరస్ సోకిందనే ఆందోళనతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటే.. అనంతపురం జిల్లాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు మాత్రం కోలుకొని ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యింది. కరోనా పేరెత్తితేనే ప్రజలు భయంతో వణికిపోతున్న తరుణంలో ఆ బామ్మ ఏ మాత్రం భయపడకుండా కరోనాను జయించింది. కోవిడ్‌పై తన గెలుపుకి కారణాన్ని ఆ బామ్మ తనచిరునవ్వుతో వివరించింది…

అనంతపురం జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారి పల్లిలో 102 ఏళ్ల సుబ్బమ్మ కరోనా మహమ్మారి బారినపడింది. తొలుత సుబ్బమ్మ కుటుంబ సభ్యులకు కరోనా అనుమానిత లక్షణాలు రావడంతో ఆమెకు కూడా గత నెల 21న కరోనా పరీక్షలు చేయించారు. టెస్టుల్లో సుబ్బమ్మకు కూడా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె వయసు 102 ఏళ్లు కావటంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. కానీ, సుబ్బమ్మ మాత్రం అధైర్యపడకుండా వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంది. సమయానికి రాగి ముద్ద, చికెన్, బత్తాయి రసం తీసుకుంటూ కరోనాను జయించానంటోంది. 16 రోజుల తర్వాత ఆమెకు కరోనా పరీక్షలు చేయగా కరోనా నెగటివ్‌గా తేలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 102 వయసులో కకూడా బామ్మ కరోనా మహమ్మారిపై జయించడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను పలకరించడానికి ఇంటికి వెళ్తున్నారు.

కరోనా వైరస్ పాజిటివ్‌తో ఎవరూ అధైర్య పడవద్దని గుండె ధైర్యంతోనే కరోనాను జయించవచ్చని బామ్మ నిరూపించింది. అదేవిధంగా బామ్మ ఇంటిలో అందరికీ కరోనా పాజటివ్ వచ్చి నేడు అందరూ కోలుకున్నారు. అందులో బామ్మ కూడా ఉంది. కరోనాను జయించిన కుటుంబం పట్ల స్థానికులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.