బాబు కలలను ‘ నేలమట్టం ‘ చేశారు !

ఉండవల్లిలో ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసింది. అయితే టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు కలలనే ‘ నేలమట్టం ‘ చేశారా అన్న అభిప్రాయాలతో టీడీపీ వర్గాలు కలవరం చెందుతున్నాయి. అసలీ ప్రజావేదిక పూర్వాపరాలేమిటి ? ఇది చట్ట నిబంధనలకు లోబడి లేదని తెలుస్తోంది.ఇది విజయవాడలోని రియల్ ఎస్టేట్ డెవలపర్స్… లింగమనేని ఎస్టేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ వారి కట్టడమట. కృష్ణా నది తీరాన 1.35 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించిన తమ బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ ను వైసీపీ ప్రభుత్వం కూల్చివేస్తుందని ఈ డెవలపర్స్ కలలో కూడా ఊహించి ఉండరు. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి ఈ కట్టడాన్ని అద్దెకు ఇఛ్చినందుకు వారిప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారట. లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్ అనే ఈ ప్రమోటర్లు మొదట్లో నాడు ఏపీ సీఎం అంతటి వ్యక్తికి తమ గెస్ట్ హౌస్ ను కేటాయించడం గర్వకారణంగా భావించారు. 2015 సెప్టెంబరు వరకు ఈ కట్టడం సాధారణ గెస్ట్ హౌస్ గానే ఉండేది. ఆ ఏడాది అక్టోబరు నెలలో తన అధికారిక నివాసాన్ని అమరావతిలోని ఇక్కడికి మార్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే నదీ పరిరక్షణ చట్టంతో సహా పలు రూల్స్ ని అతిక్రమించి ఈ కట్టడం నిర్మించారన్న ఆరోపణలున్నాయి. బాబు నివాసానికి దగ్గరలోనే ఉందీ కట్టడం. కృష్ణా రివర్ బెడ్ పై ఈ భవనాన్ని నిర్మించినందుకు గతంలో పలు నోటీసులను లింగమనేని డెవెలపర్స్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది.

ప్రకాశం బ్యారేజీకి అతి దగ్గరలోని ఈ కట్టడంలో నాలుగు బెడ్ రూములు, హోం థియేటర్, బాబు సిబ్బందికి అదనపు గదులు, మినీ కాన్ఫరెన్స్ హాలు ఉన్నాయి. పైగా చంద్రబాబుకు అనుకూలంగా దగ్గరలోనే హెలిపాడ్ కూడా నిర్మించారు. తమ ఈ కట్టడాన్ని ఆయనకు కేటాయించడం ద్వారా లింగమనేని వారు పలు ప్రయోజనాలను పొందారట. తాడికొండ మండలం కంతేరు గ్రామంలో లింగమనేని సంస్థలకు గల ఎన్నో ఎకరాల భూములను లాండ్ పూలింగ్ పరిధి నుంచి చంద్రబాబు తప్పించారన్న ప్రధాన ఆరోపణ ఒకటుంది. ఈ గ్రామంలో లింగమనేని ఎస్టేట్స్ కు వందలాది ఎకరాల భూములున్నాయని, వాటికి ఈ లాండ్ పూలింగ్ ‘ నీడ ‘ సోకలేదని అంటున్నారు. బహుశా ఈ విషయాలన్నీ తెలిశాకే జగన్ ప్రభుత్వం ఇది అక్రమ కట్టడమని గుర్తించి కూల్చివేతకు పూనుకొన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *