మైనర్ బాలికలే టార్గెట్.. పదేళ్లుగా పదుల సంఖ్యలో దారుణాలు.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌

అభంశుభం తెలియని చిన్నారులపై ఓ ప్రభుత్వ ఉద్యోగి పదేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో కలకలం రేపింది.

  • Balaraju Goud
  • Publish Date - 9:05 pm, Tue, 17 November 20

అభంశుభం తెలియని చిన్నారులపై ఓ ప్రభుత్వ ఉద్యోగి పదేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో కలకలం రేపింది. పదేళ్లుగా 50 మంది చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఓ జూనియర్‌ ఇంజనీర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచిన అనంతరం సీబీఐ అధికారులు వివరాలను వెల్లడించారు.

సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. చిత్రకూట్‌ జిల్లాకు చెందిన రామ్‌భవన్‌ అనే వ్యక్తి యూపీలో జూనియర్‌ ఇంజనీర్‌గా ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. పైకి బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తూ కన్నుపడిన బాలికపై కామవాంఛను తీర్చుకునేవాడు. పదేళ్లుగా దాదాపు 50 మందికి పైగా బాలికలపై అత్యాచారం చేశాడు. వీరిలో చాలామంది మైనర్‌ బాలికలే కావడం గమనార్హం. చిత్రకూట్‌, హామీర్పూర్‌, బండా ప్రాంతాల్లోని పేద మైనర్‌ బాలికలను, ముఖ్యంగా 5 నుంచి 16ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులను టార్గెట్‌గా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో అతడిని బండ జిల్లాలో అరెస్టు చేసి సంబంధిత న్యాయస్థానంలో ప్రవేశపెట్టామని సీబీఐ అధికారులు తెలిపారు. నిందితుడి ఇంటిపై నిర్వహించిన సోదాల్లో 8 మొబైల్‌ ఫోన్లు, రూ.8లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, ఇతర డిజిటల్‌ సాక్ష్యాలు, భారీ సంఖ్యలో చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్స్‌, వీడియోలు స్వాధీనం చేసుకున్నామని ఆర్కే గౌర్ వివరించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని షేరింగ్‌ చేసుకునే విషయంలో.. అతడు పలువురు విదేశీయులతో సంబంధాలు ఉన్నట్లు ఈమెయిల్స్‌ ఆధారంగా వెల్లడైంది. తాను చేసే అసాంఘిక కార్యకలాపాల గురించి చిన్నారులు బయట చెప్పకుండా ఉండేందుకు నిందితుడు మొబైల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు వారికి కానుకగా ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు.

అయితే, గతంలోనే ఇతనిపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వచ్చినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో యూపీ పోలీసు శాఖ ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అతని నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు పెద్ద ఎత్తున సాక్ష్యాలను సేకరించి అరెస్ట్‌ చేశారు. కాగా, మైనర్‌ బాలికలపై ఆకృత్యానికి పాల్పడిన రామ్‌ భవన్‌కు కఠిన శిక్ష పడేలా చూస్తామని అధికారులు తెలిపారు.