సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్‌ దురిశెట్టి

యూపీఎస్సీ సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలామందికి ఒక అపోహ ఉంటుంది. పరీక్షలో విజయం సాధించాలంటే రోజుకు 18 నుంచి 19 గంటలు చదవాలని, రాత్రిళ్లు నిద్రపోకుండా కష్టపడాలని భావిస్తుంటారు. అయితే ఎక్కువ గంటలు చదవడం కంటే ప్రణాళికాబద్ధంగా, ఏకాగ్రతతో చదవడం ముఖ్యమని 2018 యూపీఎస్సీ సివిల్స్ టాపర్ అనూదీప్ దురిశెట్టి సూచించారు. అనూదీప్ 2017లో నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ పరీక్షల్లో ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో అనూదీప్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు..

సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్‌ దురిశెట్టి
UPSC Topper Anudeep Durishetty

Updated on: Oct 15, 2026 | 7:42 AM

హైదరాబాద్, అక్టోబర్ 12: మన దేశంలో సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. దీంతో పోటీ తీవ్రంగా ఉండటం సహజం. అయితే, ఈ పోటీని ఎదుర్కోవడానికి రోజుకు 18 లేదా 19 గంటలు చదవాల్సిందేనని అనుకోవడం సరైన పద్ధతి కాదని అనూదీప్ దురిశెట్టి అభిప్రాయపడ్డారు. మనిషి నిరంతరంగా ఒక పరిమితి వరకే సమర్థంగా పనిచేయగలడని, ప్రతిరోజూ ఎక్కువ గంటలు నిద్రను తగ్గించుకుని చదవడం దీర్ఘకాలంలో సాధ్యం కాదని వివరించారు. రోజంతా ఒకే పుస్తకాన్ని పట్టుకుని కూర్చోవడం కంటే, తక్కువ సమయం చదివినా పూర్తి ఏకాగ్రతతో చదవడం ముఖ్యం. చదివిన అంశాలు ఎంతవరకు అర్థమయ్యాయి? వాటిని గుర్తుంచుకోగలుగుతున్నామా? పరీక్షలో సరైన సమాధానాలు రాయగలుగుతున్నామా? అనే విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా పరీక్ష సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యూపీఎస్సీ వంటి పరీక్షల్లో ప్రశ్నలు సిలబస్‌కు అనుగుణంగానే ఉంటాయని, కాబట్టి సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధించడం కీలకమని అనూదీప్ పేర్కొన్నారు. ఏయే అంశాలు చదవాలి? ఏ టాపిక్‌కు ఎంత సమయం కేటాయించాలి? ఎప్పటిలోగా సిలబస్ పూర్తి చేయాలి? అనే విషయాలపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకుండా గంటల తరబడి చదవడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అందుకే చదివే సమయం కంటే ఆ సమయంలో ఎంత నేర్చుకున్నామన్నది ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పోటీ పరీక్షల సన్నద్ధతలో సిలబస్ పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, చదివిన అంశాలను పునశ్చరణ చేయడం కూడా అంతే ముఖ్యం. ఒకసారి చదివినంత మాత్రాన అన్ని విషయాలు పరీక్ష సమయానికి గుర్తుంటాయని చెప్పలేం. అందుకే ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాలి. అభ్యర్థులు తమకు నిర్దేశించుకున్న సమయంలో సిలబస్ పూర్తి చేయడంతో పాటు, ఇప్పటికే చదివిన అంశాలను మళ్లీ చదివేలా టైమ్‌టేబుల్ రూపొందించుకోవాలి. చదివిన విషయాలు ఎంతవరకు గుర్తున్నాయి? వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలుగుతున్నామా? అనే విషయాలను స్వీయ పరీక్షల ద్వారా తెలుసుకోవాలి.

పరీక్షలో సమాధానాలు తెలిసి ఉండటం మాత్రమే సరిపోదు. నిర్దేశించిన సమయంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి, సరిగ్గా రాయగలగాలి. అందుకోసం మాక్ టెస్టులు, పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం అవసరం. ప్రాక్టీస్ ద్వారా సమయపాలన మెరుగుపడటంతో పాటు, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో కూడా తెలుసుకోవచ్చు. తప్పులు ఎదురైనప్పుడు వాటిని విశ్లేషించుకుని, మళ్లీ అవే పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా సివిల్స్ వంటి పరీక్షల్లో సమాధానాల నాణ్యత, విశ్లేషణాత్మక ఆలోచన, సమయ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అభ్యర్థులు తమ మొత్తం సిలబస్‌ను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలని అనూదీప్ సూచించారు. ఉదాహరణకు, సిలబస్‌లో 100 అంశాలు ఉండి, వాటిని పూర్తి చేయడానికి 100 రోజుల సమయం ఉంటే.. రోజుకు ఒక అంశం చొప్పున పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవచ్చు. అయితే, ప్రతి అంశానికి పట్టే సమయాన్ని బట్టి లక్ష్యాలను సర్దుబాటు చేసుకోవాలి. రోజువారీ లక్ష్యాలతో పాటు వారానికోసారి, నెలకోసారి తమ పురోగతిని సమీక్షించుకోవాలి. అనుకున్న సమయానికి సిలబస్ పూర్తవుతోందా? రివిజన్‌కు తగిన సమయం లభిస్తోందా? మాక్ టెస్టుల్లో మార్కులు మెరుగుపడుతున్నాయా? అనే అంశాలను పరిశీలించాలి. అవసరమైతే చదివే విధానంలో మార్పులు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఒకే రోజు ఎక్కువ గంటలు చదవడం కంటే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవడం ముఖ్యం. సరైన ప్రణాళిక, సిలబస్‌పై అవగాహన, పునశ్చరణ, మాక్ టెస్టులు, సమయపాలనతో కూడిన సాధన అభ్యర్థులకు మెరుగైన ఫలితాలను అందించగలవు. రోజుకు ఎన్ని గంటలు చదివామన్నది కాదు.. ఎంత ఏకాగ్రతతో చదివాం, ఎంత నేర్చుకున్నాం, పరీక్షలో ఎంత సమర్థంగా సమాధానాలు రాయగలిగామన్నదే ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తుంచుకుని స్మార్ట్ వర్క్‌తో ముందుకు సాగితే సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us