TGPSC JL Merit List: జూనియర్‌ లెక్చరర్‌ ఎకనామిక్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. వారికి నేడు, రేపు వెరిఫికేషన్‌

|

Nov 26, 2024 | 12:55 PM

జూనియర్‌ లెక్చరర్‌ ఎకనామిక్స్ సబ్జెక్ట్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ నుంచి మెరిట్ లిస్టును డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

TGPSC JL Merit List: జూనియర్‌ లెక్చరర్‌ ఎకనామిక్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. వారికి నేడు, రేపు వెరిఫికేషన్‌
TGPSC JL
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 26: తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే కొన్ని సబ్జెకుల ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జేఎల్‌ ఎకనామిక్స్‌ ఫలితాలను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఎకనామిక్స్‌, ఎకనామిక్స్‌ ఉర్దూ మీడి యం పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. మరోవైపు జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టుల భర్తీలో భాగంగా ఇప్పటికే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కొనసాగుతుంది. నేడు మరి కొంతమంది అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో ప్రకటించింది. బోటనీ, హిందీ, తెలుగు, జువాలజీ అభ్యర్థులకు మంగళవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఈ రోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గైర్హాజరైన వారికి ఈ నెల 27న (బుధవారం) రిజర్వ్‌డేలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టవల్సిన గడువును ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. నవంబర్‌ 27వ తేదీతో తుది గడువు ముగియనుండగా.. దానిని డిసెంబర్‌ 3వ తేదీ వరకు పొడిగించినట్టు బోర్డు కార్యదర్శి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 12వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 17వ తేదీ వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 24, రూ.2000 ఆలస్య రుసుముతో జనవరి 1 వరకు పరీక్ష పీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

నవంబర్‌ 26, 27 తేదీల్లో జేఈఈ దరఖాస్తులకు ఎడిట్‌ ఆప్షన్‌ యాక్టివ్‌

జేఈఈ మెయిన్స్‌ తొలి విడతకు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు నవంబర్‌ 26, 27 తేదీల్లో అవకాశం ఇస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ రోజు, రేపు వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, పదో తరగతి, 12వ తరగతి, పాన్‌కార్డు నంబర్‌, పరీక్ష కేందం, మీడియం వివరాలను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, అడ్రస్‌, ఎమర్జెన్సీ కాంట్రాక్ట్‌ నంబర్‌, ఫొటోను మాత్రం మార్చుకోవడానికి వీలులేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.