TS Police Jobs 2022: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ముఖ్యగమనిక.. నియామక బోర్డు కొత్త నిబంధనలివే..

|

May 05, 2022 | 8:12 PM

తెలంగాణ పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు దరఖాస్తుకు ముందే రిజిస్ట్రేషన్‌ చేసే విధానాన్ని తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) అమల్లోకి తెచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగాల్లో..

TS Police Jobs 2022: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ముఖ్యగమనిక.. నియామక బోర్డు కొత్త నిబంధనలివే..
Registration
Follow us on

Pre-application registration process for Telangana Police jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు దరఖాస్తుకు ముందే రిజిస్ట్రేషన్‌ చేసే విధానాన్ని తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) అమల్లోకి తెచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగాల్లో వన్‌టైం రిజిస్ట్రేషన్‌ (OTR) మాదిరిగానే తొలుత టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. ప్రాథమిక వివరాలతో మొదట రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తేనే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. పోలీసు ఉద్యోగాలకు కిందటిసారి (2018) నియామకాల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అంతకన్నా ఎక్కువగానే దరఖాస్తులొస్తాయని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా సర్వర్లలో లోపం తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక సిబ్బందిని సిద్ధం చేశారు. మే 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలుకాగా తొలిరోజే 15,000 దరఖాస్తులు నమోదు కావడంతో పోటీ అధికంగా ఉంటుందని మండలి వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వారందరూ ఓసీ కేటగిరిలోకి..
తెలంగాణ పోలీసు నియామకాల్లో పోటీపడే బయటి రాష్ట్రాల అభ్యర్థుల విషయంలో వర్తించే నిబంధనలను నియామక మండలి వెల్లడించింది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఏ సామాజికవర్గానికి చెందినా.. వారిని ఓసీలుగానే పరిగణించనున్నట్లు పేర్కొంది. కొత్త ప్రెసిడెన్షియల్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో 5 శాతం మాత్రమే నాన్‌లోకల్‌ కేటగిరీగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ అయిదు శాతం కోటాలోనే పోటీ పడాల్సి ఉంటుంది.

ఎన్ని పోస్టులకైనా ఒకే ఫోన్‌ నంబర్‌
ఒకే అభ్యర్థి ఎస్సైతో పాటు కానిస్టేబుళ్ల కేటగిరీలో సివిల్‌, ఏఆర్‌.. తదితర విభాగాలకు పోటీపడే అవకాశముంటుంది. ఇలా ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా, అన్నింటిలోనూ ఒకే ఫోన్‌ నంబరు, ఒకే ఈ మెయిల్‌ ఐడీని పొందుపరచాలని మండలి స్పష్టం చేసింది. ఆ ఫోన్‌ నంబరు, మెయిల్‌ ఐడీ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉండాలని తెలిపింది. నియామకాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని వీటికే పంపించనున్నారు.

రిజిస్ట్రేషన్‌లో తప్పును నమోదు చేస్తే అంతే సంగతులు..
రిజిస్ట్రేషన్‌ లేదా దరఖాస్తు నమోదు చేసే సమయంలో అభ్యర్థులు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకసారి నమోదు ప్రక్రియను పూర్తి చేస్తే, మార్పులు, చేర్పులకు అవకాశం లేదు. వివరాలు తప్పుగా నమోదైతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఒకసారి చెల్లించిన రుసుమును ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను సెల్‌ఫోన్‌ ద్వారా దాఖలు చేయొద్దని మండలి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తప్పనిసరిగా కంప్యూటర్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని సూచిస్తున్నాయి. డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌ను వినియోగించడం ఉత్తమం.

Also Read:

AP 10th Exams 2022: మ్యాథ్స్ ఎగ్జాం ప్రారంభానికి ముందే పేపర్‌లీక్‌.. ఇప్పటికే 69 మంది అరెస్ట్‌..