TS Govt Medical Jobs 2022: ఈ సారి కౌన్సెలింగ్‌ ద్వారా 2467 వైద్య నియామకాల భర్తీకి సర్కార్‌ కసరత్తులు.. త్వరలోనే ఉత్తర్వులు..

|

Apr 26, 2022 | 5:32 PM

రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న 2467 మెడికల్‌ పోస్టుల నియామకాలలో ఈసారి కొత్తగా కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ఆరోగ్యశాఖ (TS Health Department) యోచిస్తోంది..

TS Govt Medical Jobs 2022: ఈ సారి కౌన్సెలింగ్‌ ద్వారా 2467 వైద్య నియామకాల భర్తీకి సర్కార్‌ కసరత్తులు.. త్వరలోనే ఉత్తర్వులు..
Ts Medical Jobs
Follow us on

TS Govt plans to recruit specialist doctor Posts through counselling 2022: రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న 2467 మెడికల్‌ పోస్టుల నియామకాలలో ఈసారి కొత్తగా కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ఆరోగ్యశాఖ (TS Health Department) యోచిస్తోంది. ఒక్కో అభ్యర్థికి కనీసం నాలుగైదు ఐచ్ఛికాలను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా ఆయా స్పెషలిస్టు వైద్యులు (Specialist Doctors) తాము కోరుకున్న చోట ఉద్యోగం చేసే అవకాశముంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే చోటుకి ఎక్కువమంది ఆప్షన్లు ఇస్తే.. అర్హత, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ తాజాగా ప్రతిపాదనలు రూపొందించింది. ప్రభుత్వ అనుమతి రాగానే మార్గదర్శకాలను రూపొందించాలని యోచిస్తోంది.

కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇవ్వకపోతే.. వైద్యులు విధుల్లో చేరరు. చేరినా.. వారానికి ఒకరోజు చొప్పున హాజరవుతుంటారు.. మరీ కఠినంగా ఉంటే విధులకు దీర్ఘకాలంగా సెలవులు పెడతారు.. అంతే తప్ప ఇష్టం లేని చోట విధులు నిర్వర్తించరని 2018లో చేపట్టిన నియామకాల్లోనే తేటతెల్లమైంది. ఆ సంవత్సరంలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 911 మంది స్పెషలిస్ట్‌ వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎక్కువమందికి కోరుకున్న చోట కాకుండా.. సొంత ప్రాంతాలకు దూరంగా పోస్టింగులిచ్చారు. దీంతో 600 మంది వరకే విధుల్లో చేరారు. చేరిన వారిలోనూ చాలామంది విముఖతతో విధులకు ఎగనామం పెట్టారు. వీరిలో కొందరికి నోటీసులిచ్చి తదనంతర పరిణామాల్లో ఉద్యోగాల్లోంచి తీసేశారు. మొత్తం 911 పోస్టుల్లో సగానికి పైగా ఖాళీలే మిగలడం గమనార్హం.

ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి కౌన్సెలింగ్‌ విధానం సరైందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో నెలకొంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల్లో ప్రధానంగా 2467 కార్డియాలజీ, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌, జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, అనస్థీషియా, పల్మనరీ మెడిసిన్‌ తదితర స్పెషలిస్ట్‌ పోస్టులుండగా మరో 1,200 వరకూ ఎంబీబీఎస్‌ అర్హతతో భర్తీ చేసే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులున్నాయి. కోరుకున్న చోటుకు పోస్టింగ్‌ ఇస్తేనే స్పెషలిస్టు వైద్యులు చేరుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొత్తగా చేరనున్న వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేసుకోవడానికి అనుమతి ఇవ్వకూడదనే షరతును విధించాలని ఆరోగ్యశాఖ యోచిస్తోంది.

Also Read:

Free Police Coaching 2022: పోలీస్ శాఖ ఇచ్చే శిక్షణ వైపే నిరుద్యోగుల చూపు.. జాబ్‌ గ్యారెంటీనా? నిజమెంతా..