Public Libraries in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో వరుసగా వెలువడుతున్న నోటిఫికేషన్లు.. మరోవైపు సన్నద్ధతలో తలమునకలు.. వేలాది మంది అభ్యర్థుల రాకతో నగరంలోని లైబ్రరీలు కిక్కిరిసిపోతున్నాయి. సరిపడా చోటు లేక అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. విశ్వవిద్యాలయంతో పాటు నగరంలోని పబ్లిక్ లైబ్రరీలు సైతం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులతో కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 16,614 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల (TS Police Constable Notifications 2022) భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు 677 ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధతపై దృష్టిపెట్టారు. రేయింబవళ్లు కష్టించి ఉద్యోగం సాధించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. లైబ్రరీలకు చేరుకుని పోటీ పరీక్షల సిలబస్‌కు తగిన పుస్తకాలు తీసుకుని సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు.
ముందుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. వందలాది మంది విద్యార్థులు రావడం, సరిపడా కుర్చీలు లేకపోవడంతో ముందుగా లోపలికి చేరుకుంటేనే.. కూర్చుని చదువుకునే అవకాశం ఉంది. ఉదయం 9 నుంచి రాత్రి 11గంటల వరకు వర్సిటీ గ్రంథాలయం తెరిచి ఉంటుంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడంతో సీట్లు ఉంటాయో.. లేదోనన్న ఉద్దేశంతో ఆందోళనకు గురయ్యారు. సరైన సౌకర్యాలు లేకపోవడంపై అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాగునీటికి సరైన సౌకర్యం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మరుగుదొడ్ల వద్ద పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది. ఇటీవల ఓ విద్యార్థిని కిందపడటంతో కాలికి గాయమైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు పెద్దసంఖ్యలో రానుండటంతో యూనివర్సిటీ తగిన వసతులు కల్పించాలని కోరుతున్నారు.
యూనివర్సిటీ లైబ్రరీలతో పాటు నగరంలో పబ్లిక్ లైబ్రరీల్లో సైతం సరైన వసతులు లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా 86 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిల్లో పెద్దసంఖ్యలో అభ్యర్థులు వస్తే చదువుకునేందుకు వసతులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం చిక్కడపల్లిలోని కేంద్ర గ్రంథాలయానికి నిత్యం పెద్దసంఖ్యలో విద్యార్థులు, అభ్యర్థులు వస్తున్నారు. అక్కడి చెట్ల కిందనే కూర్చుని చదువుకుంటున్నారు. గ్రంథాలయాల్లో కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సరిపోను కుర్చీలు వేసేందుకు అక్కడ వసతులు సరిగా లేవు. ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయని అభ్యర్థులు వాపోతున్నారు.
Also Read: