TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించిన ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభమైంది. జులై 1 వరకు ఇది కొనసాగనుండగా, ఈసారి కన్వీనర్‌ కోటా, ఈడబ్ల్యూఎస్‌ కోటా కలిపి మొత్తం 89,252 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు..

TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం
TS EAPCET Engineering Counselling

Updated on: Jun 25, 2026 | 10:50 AM

హైదరాబాద్‌, జూన్‌ 25: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా తొలి విడత వెబ్‌ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. జులై 1 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో విద్యార్థులకు మొత్తం 89,252 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 81,620 సీట్లు అందుబాటులో ఉండగా, ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా కింద మరో 7,632 సీట్లు ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం 89,252 సీట్లను తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో కన్వీనర్‌, ఈడబ్ల్యూఎస్‌, యాజమాన్య కోటా సీట్లను కలుపుకుని మొత్తం బీటెక్‌ సీట్లు 1,21,639 ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది చివరి విడత నాటికి 178 కళాశాలలు ఉండగా, ఈసారి వాటి సంఖ్య 175కు తగ్గింది. వీటిలో 22 యూనివర్సిటీ కళాశాలలు, రెండు ప్రైవేట్‌ యూనివర్సిటీలు, 151 ప్రైవేట్‌ అనుబంధ కళాశాలలు ఉన్నాయి.

అయితే కౌన్సెలింగ్‌ చివరి విడత నాటికి కళాశాలల సంఖ్యతో పాటు సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది తొలి విడతలో 83,054 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, చివరి విడత నాటికి అవి 91,645కు చేరుకున్నాయి. ఇక ఎప్‌సెట్‌లో టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో రాష్ట్రంలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి 1 నుంచి 100 ర్యాంకుల మధ్య ఉన్న విద్యార్థుల్లో కేవలం ఐదుగురు మాత్రమే కౌన్సెలింగ్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. 101 నుంచి 500 ర్యాంకుల వరకు 42 మంది, 501 నుంచి 1,000 ర్యాంకుల వరకు 135 మంది మాత్రమే స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. మొత్తంగా తొలి వెయ్యి ర్యాంకుల్లో 182 మంది మాత్రమే రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో కూడా కొందరు చివరికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు, రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో యాజమాన్య కోటా (బి-కేటగిరీ) సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం సీట్లలో 30 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. నోటిఫికేషన్‌ విడుదల తర్వాత దరఖాస్తుల స్వీకరణకు కనీసం ఏడు పనిదినాల గడువు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. యాజమాన్య కోటా సీట్ల భర్తీని తొలుత జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా, ఆ తర్వాత ఎప్‌సెట్‌ ర్యాంకులు, చివరగా ఇంటర్మీడియట్‌ మార్కుల మెరిట్‌ ఆధారంగా నిర్వహించనున్నారు. అలాగే కొన్ని కళాశాలలు తమ యాజమాన్య కోటా సీట్లలో భాగాన్ని ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కూడా భర్తీ చేయనున్నాయి. ఇంజినీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులకు ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కీలకంగా మారనుండగా, అందుబాటులో ఉన్న సీట్లు, కళాశాలలు, కోర్సుల వివరాలను పరిశీలించి వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ ఈఏపీసెట్‌ 2026 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే

  • నోటిఫికేషన్‌ విడుదల: జూన్‌ 29
  • దరఖాస్తులకు చివరి తేదీ: జులై 15
  • అడ్మిషన్ల ముగింపు తేదీ: జులై 28
  • ఆలస్య రుసుము లేకుండా విద్యామండలికి జాబితా పంపే గడువు: జులై 29
Follow Us